ఓవల్ మైదానంలో జరుగుతున్న ఆఖరి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ కేవలం రెండు సెషన్లలోనే ముగిసింది. అయితే, టాప్ ఆర్డర్ బ్యాటర్లు ధాటిగా ఆడడంతో ఇంగ్లాండ్ స్కోరు బోర్డు 247 పరుగులకు చేరింది. ఈ స్కోరుతో ఇంగ్లాండ్ 23 పరుగుల లీడ్‌ను సాధించింది. లంచ్ విరామానికి కాస్త ఒత్తిడిలో కనిపించిన భారత్, అనంతరం అదిరిపోయే రీతిలో పుంజుకుని ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌ను కూల్చేసింది.
ప్రారంభ సెషన్‌లో బెన్ డకెట్ – జాక్ క్రాలీ బజ్‌బాల్ స్టైల్‌లో దాడి చేసి భారత పేసర్లను ఇబ్బందిపెట్టారు. మ్యాచ్ పూర్తిగా ఇంగ్లాండ్ కంట్రోల్‌లోకి వెళ్తుందా అనిపించిన సమయంలో, ఆకాశ్ దీప్ కీలకంగా నిలిచి డకెట్‌ను 43 పరుగుల వద్ద ఔట్ చేశాడు.
లంచ్ తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ తన తొలి బంతికే క్రాలీ (64)ను పెవిలియన్‌కు పంపించాడు. జో రూట్ క్రీజులో కాసేపు నిలదొక్కుకున్నా, భారత బౌలర్లు ఆటపై తిరిగి పట్టు సాధించారు. మహ్మద్ సిరాజ్ అద్భుతమైన స్పెల్‌తో పోప్ (22), రూట్ (29), బెతెల్ (6) వికెట్లు తీశాడు.
సిరాజ్ రెండో స్పెల్ మ్యాచ్ దిశను పూర్తిగా భారత్ వైపుగా తిప్పింది. టీ విరామానికి ముందు ప్రసిద్ధ్ కృష్ణ ఒకే ఓవర్లో జేమీ స్మిత్, ఓవర్టన్ వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్‌ను గట్టిగా దెబ్బతీశాడు.
ఇక చివర్లో హ్యారీ బ్రూక్ (53) పోరాడుతూ టైలెండర్ల సహాయంతో స్కోరును 247కి చేర్చాడు. చివరికి ఇంగ్లాండ్ 247 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ ఇప్పుడు 23 పరుగుల వెనుకంజతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఈ దశలో మ్యాచ్‌పై ఆధిపత్యాన్ని సాధించడం భారత్ లక్ష్యం కానుంది.