ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : పహల్గాం దాడి (Pahalgam attack)కి పాల్పడిన మాస్టర్ మైండ్ (master mind) ను భారత బలగాలు మట్టుబెట్టడం చర్చనీయాంశంగా మారింది. పహల్గాం దాడికి పాల్పడిన టెర్రస్టులను మట్టుబెట్టేందుకు ఆపరేషన్ మహదేవ్ చేపట్టిన బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను అంతం చేశాయి. పహల్గాం దాడికి మాస్టర్ మైండ్ తో పాటు మరో ఇద్దరినీ కలిపి మొత్తం ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి కేంద్ర బలగాలు. లష్కర్ కమాండర్ సులేమాన్ షా అలియాస్ ముసా ఫౌజీ పహల్గాం దాడుల వెనుక కీలక సూత్రదారి అని సైన్యం తెలిపింది. పహల్గాం దాడిలో 26 మంది భారత పౌరులు చనిపోయిన విషయం తెలిసిందే.
ముసా గతంలో కూడా పలు ఉగ్ర కార్యకలాపాల్లో నిందితుడు. గత సంవత్సరం శ్రీనగర్-సోన్మార్గ్ Z-మోర్త్ సొరంగం నిర్మాణ సమయంలో ఏడుగురు కార్మికులను చంపిన కేసులో నిందితుడు. ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ లో ఈ ముగ్గురు హతమయ్యారు. ఆపరేషన్ మహదేవ్ సందర్భంగా.. ఉగ్రవాదుల నుంచి 17 గ్రెనేడ్ బాంబులు, AK-47 రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నారు.
పహల్గాం ఉగ్రదాడి మాస్టర్ మైండ్…
ఈ పర్వత ప్రాంతాల్లో ఆదివారం అర్ధరాత్రి దాటాక రెండు గంటల సమయంలో చైనా తయారీ ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ సెట్ ‘టీ82’ యాక్టివేట్ అయినట్లు భద్రతా దళాలు గుర్తించాయి. సులేమాన్ షా అలియాస్ హషీమ్ మూసా (Hashim Musa) పనిని సైన్యం మూడు గంటల్లో ముగించేసింది. అతడి జాడను గుర్తించిన కమాండోలు మెరుపు వేగంతో ఆపరేషన్ చేపట్టారు. అర్ధరాత్రి కమ్యూనికేషన్ ను గుర్తించారు. ఆ తర్వాత ఉదయం ఉగ్రవాదుల కదలికలను నేరుగా చూశారు. అంతే.. రాష్ట్రీయ రైఫిల్స్.. పారా కమాండోలు అడవుల్లోకి వెళ్లారు. ప్రతి నిమిషం ఉత్కంఠ మధ్య 11గంటలకు ఉగ్రమూకకు అత్యంత సమీపంలోకి చేరారు. తొలి కాల్పుల్లోనే వారిని మట్టుబెట్టేశారు.
అర్ధరాత్రి అల్ట్రాసెట్ సిగ్నల్స్ తో అప్రమత్తం..
ఈ ఉగ్రమూక శ్రీనగర్ (Srinagar) లోనే అత్యంత ఎత్తైన మహాదేవ్ పర్వత పరిసరాల్లో నక్కినట్లు సమాచారం అందింది. ఇది 13,000 అడుగుల ఎత్తుతో ఏడాది పొడవునా మంచుతో కప్పి ఉంటుంది. ఈ పరిసర ప్రాంతాలను కశ్మీరీ హిందువులు సావన్ (శ్రావణ)మాసంలో చాలా పవిత్రంగా చూస్తారు.