ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం (ఉమ్మడి ఖమ్మం) జిల్లాల్లో అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, వర్షాకాలం నేపథ్యంలో తలెత్తిన సమస్యలపై సమీక్షను ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నిర్వహించారు. ఈ సమీక్ష ఆదివారం పాల్వంచలోని ఐడీఓసీ సమావేశ మందిరంలో జరిగింది.
సమీక్షలో రాష్ట్ర మంత్రులు వాకాటి శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా ఇన్‌చార్జిగా వాకాటి శ్రీహరి, వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ, గృహనిర్మాణ, ఐ అండ్ పీఆర్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. జిల్లా కలెక్టర్లు అనుదీప్ దురిశెట్టి (ఖమ్మం), జితేష్ వి పాటిల్ (భద్రాద్రి కొత్తగూడెం) పవర్‌పాయింట్ ద్వారా జిల్లాల పరిస్థితులు, ప్రభుత్వం చేపట్టిన చర్యలపై వివరాలను సమర్పించారు.
సమీక్షలో ప్రధానంగా వరద ముంపు ప్రాంతాల్లో పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులు, సీజనల్ వ్యాధుల వ్యాప్తి, వైద్య సేవల లభ్యత, ఎరువుల సరఫరా, రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, వనమహోత్సవాల నిర్వహణ, విద్యారంగ అభివృద్ధిపై చర్చ జరిగింది.
ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ…, భారీ వర్షాలు, వరదల పరిస్థితిని ఎదుర్కొనేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఇందిరా సౌర జల వికాసం పథకంలో భాగంగా గిరిజన రైతులకు సోలార్ పంపులు, డ్రిప్, స్ప్రింక్లర్ పద్ధతులను ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. ఈ పథకం కోసం వచ్చే మూడు సంవత్సరాల్లో రూ.12,600 కోట్లు వెచ్చించనున్నట్టు పేర్కొన్నారు.
మహిళా సంఘాల ద్వారా చేపల ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసి చేపల పెంపకాన్ని ప్రోత్సహించనున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ప్రతి జిల్లాలో 25 ఎకరాల స్థలంలో నిర్మించనున్నట్లు తెలిపారు. ఇవి ఇతర పాఠశాలలకు ఆదర్శంగా ఉండేలా అభివృద్ధి చేయాలన్నారు.
మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇప్పటివరకు రూ.200 కోట్ల విలువైన ఉచిత బస్సు ప్రయాణాలు మహిళలకు లభించాయని చెప్పారు. అలాగే రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి ప్రయోజనాలను ప్రజలకు అందించినట్లు వివరించారు.
ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లను మంజూరు చేశామని, వారంవారీగా నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు. మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు లక్ష కోట్ల రూపాయల బ్యాంకు రుణాల లింకేజ్ కల్పించేందుకు ప్రణాళిక రూపొందించినట్టు ఆయన తెలిపారు.