న్యూ ఢిల్లీ | పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్ విమానాలకు మన గగనతల నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఆగస్టు 23 వరకు నిషేధం కొనసాగుతుందని తెలిపింది.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ విమానాలకు గగనతల నిషేధాన్ని విధిస్తూ ఏప్రిల్ 30న కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. అనంతరం దీన్ని పొడిగిస్తూ వస్తున్నది. తాజాగా మరోసారి పొడిగించింది. ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
మరోవైపు, పాకిస్థాన్ కూడా భారత విమానాలకు తమ గగగతల నిషేధాన్ని పొడిగించింది. ఆగస్టు 24 వరకు నిషేధం కొనసాగుతుందని తెలిపింది. ఈ నిషేధం ఆగస్టు 24 తెల్లవారుజామున 5:19 గంటల వరకూ అమల్లో ఉంటుందని పాకిస్థాన్ విమానాశ్రయ అథారిటీ తెలిపింది.
కాగా, పాకిస్థాన్‌తో సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంతో పాక్ ఏప్రిల్ 24న గగనతల నిషేధాన్ని విధించిన విషయం తెలిసిందే.