Avatar: Fire and Ash | ఈసారి అగ్గితో.. “అవతార్ 3” ఫ‌స్ట్ లుక్ రిలీజ్ !

హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ క్యామరూన్ సృష్టించిన అవతార్ ఫ్రాంచైజీ మరోసారి ప్రపంచ సినీ ప్రియులను అద్భుత దృశ్యాల్లోకి తీసుకువెళ్లనుంది. ఈ సిరీస్‌లో మూడో భాగం ‘‘అవతార్: ఫైర్ అండ్ యాష్’’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ చిత్రం డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. బహుళ భాషల్లో విడుదలవుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ ఈరోజు (మంగళవారం) విడుదల చేశారు. విడుదలైన కొన్ని గంటల్లోనే, ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీకెండ్ థియేటర్లలో విడుదల కానున్న ది ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ తో కలిసి అవతార్ 3 ట్రైలర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు.

ఈసారి ‘‘అవతార్ 3’’ ‘అగ్ని’ కాన్సెప్ట్ చుట్టూ తిరిగేలా రూపొందించారు. ఇప్పటివరకు పండోర అనే కల్పిత గ్రహాన్ని నీరు, అడవి నేపథ్యాలతో చూపించిన క్యామరూన్ ఈసారి అగ్నికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్టు టాక్.

ఇక విజువ‌ల్ వండ‌ర్ లోని ‘‘అవతార్’’ నాలుగో భాగం 2029లో, ఐదో భాగం 2031 డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని కూడా చిత్ర బృందం ప్రకటించింది.

2009లో వచ్చిన మొదటి అవతార్ సినిమా ద్వారా జేమ్స్ క్యామరూన్ ఆకాశానికి ఎత్తేసిన విజువల్ ఎఫెక్ట్స్‌ను రెండు భాగాలతో మరింత ముందుకు తీసుకువెళ్ళారు. రెండో భాగం ‘‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’’ ప్రపంచవ్యాప్తంగా 160 భాషల్లో విడుదలై భారీ కలెక్షన్లు రాబట్టి సరికొత్త రికార్డులు సృష్టించింది.

జేమ్స్ క్యామరూన్ సృష్టించిన‌ పండోర ప్రపంచంలోని కొత్త అద్భుతాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Leave a Reply