TG | ప్రభుత్వానికి అందిన కుల‌ గణన సర్వే నివేదిక..

తెలంగాణ ప్ర‌భుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే – 2024 (SEEEPCS) పై ప్రభుత్వం నియమించిన స్వతంత్ర నిపుణుల కమిటీ తమ అధ్యయన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ సర్వే పూర్తి శాస్త్రీయంగా, విశ్వసనీయంగా కొనసాగించబడిందని కమిటీ అభిప్రాయపడింది. దేశానికి రోల్ మోడల్ గా నిలిచే సర్వేగా ఇది చారిత్రాత్మకంగా నిలుస్తుందని కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది.

ముఖ్యమంత్రి చేతికి 300 పేజీల నివేదిక

మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీహెచ్ఆర్డీ) లో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇండిపెండెంట్ ఎక్స్‌పర్ట్ వర్కింగ్ గ్రూప్ చైర్మన్ జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి అధ్వర్యంలోని నిపుణుల కమిటీ సభ్యులు 300 పేజీల నివేదికను అందజేసింది.

మంత్రివర్గంలో చర్చించి తదుపరి నిర్ణ‌యాలు..

నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికలోని సూచనలను మంత్రివర్గంలో చర్చించి తదుపరి నిర్ణయాలు తీసుకుంటామ‌ని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో బలహీన వర్గాల అభ్యున్నతికి, సామాజిక న్యాయానికి ఈ సర్వే దోహదం చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పట్టణ, గ్రామీణ వ్యత్యాసాలు, వాటి కారణాలను విశ్లేషించి అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని సూచించారు.

అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందించేలా చర్యలు తీసుకుంటామని, ప్రజల అవసరాలను గుర్తించి సరైన సూచనలు ఇవ్వాలని కమిటీని కోరారు.

ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ధనసరి అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావుతో పాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

నిపుణుల కమిటీ సభ్యులు

వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్ జస్టిస్ సుదర్శన్ రెడ్డితో పాటు వైస్ చైర్మన్ ప్రొఫెసర్ కంచె అయిలయ్య, సభ్యులు ప్రొఫెసర్ శాంతా సిన్హా, ప్రొఫెసర్ హిమాన్షు, డా. సుఖదేవ్ తొరాట్, నిఖిల్ డే, ప్రొఫెసర్ భాంగ్య భూక్య, ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి, ప్రొఫెసర్ జీన్ డ్రెజ్, ప్రొఫెసర్ థామస్ పికెట్టి, ప్రవీణ్ చక్రవర్తి, సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు.

సర్వే ఫలితాలు – రాష్ట్రంలో జనాభా కుల రీతిగా

జనాభా కుల వర్గాల విభజన

  • ఎస్సీలు: 61,91,294 (17.42%)
  • ఎస్టీలు: 37,08,408 (10.43%)
  • బీసీలు: 2,00,37,668 (56.36%)
  • ఇతరులు: 56,13,389 (15.89%)

సర్వే ఫలితాల ప్రకారం రాష్ట్రంలో 1,15,71,457 గృహాలు ఉన్నాయి. వీటిలో 1,12,36,849 (97.10%) కుటుంబాల నుంచి 3,55,50,759 మంది వివరాలు నమోదు చేసుకున్నారు.

కమిటీ నివేదిక సిఫారసులు అమలులోకి వస్తే సామాజిక న్యాయం మరింత బలపడుతుందని, వెనుకబడిన వర్గాల సాధికారతకు తోడ్పడుతుందని సమీకృతంగా కమిటీ అభిప్రాయపడింది.

Leave a Reply