Japan Open | రెండో రౌండ్ లోనే ముగిసిన భార‌త్ పోరు..

  • లక్ష్యసేన్, సాత్విక్-చిరాగ్, అనుపమా ఇంటిబాట‌

జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత్‌ పోరాటం ముగిసింది. టోర్నీ పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్, పురుషుల డబుల్స్‌లో సాత్విక్సైరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి జంట రెండో రౌండ్‌లోనే ఇంటి దారి పట్టగా, చివరి ఆశగా మిగిలిన అనుపమా ఉపాధ్యాయ కూడా ప్రిక్వార్టర్‌ ఫైనల్‌లో ఓటమి పాలయ్యారు.

ప్రపంచ ర్యాంకింగ్‌లో 18వ స్థానంలో ఉన్న లక్ష్యసేన్, జపాన్ షట్లర్ కోడై నరొకా చేతిలో 19-21, 11-21 పాయింట్ల తేడాతో ఓడిపోయాడు. దాదాపు ఒక గంట పాటు సాగిన ఈ మ్యాచ్‌లో లక్ష్య తన తొలి రౌండ్ గెలుపును కొనసాగించలేకపోయాడు. మొదటి రౌండ్‌లో చైనాకు చెందిన వాంగ్ జెంగ్ క్సింగ్ పై 21-11, 21-18తో ఘన విజయం సాధించినప్పటికీ, రెండో రౌండ్‌లో ఆ ఊపు కనిపించలేదు.

ఇక‌ పురుషుల డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ జంటకు కూడా నిరాశే ఎదురైంది. ఐదవ సీడ్ చైనా జంట లియాంగ్ వీ కాంగ్ – వాంగ్ చాంగ్ తో త‌ల‌ప‌డిన‌ సాత్విక్ – చిరాగ్ ద్వయం… 22-24, 14-21 పాయింట్ల తేడాతో ఓడిపోయారు.

ఇక చివరి ఆశగా నిలిచిన అనుపమా ఉపాధ్యాయ కూడా మ‌హిళ‌ల సింగిల్స్ లో రెండవ సీడ్ చైనా షట్లర్ వాంగ్ జీ హీ చేతిలో 21-13, 11-21, 12-21తో 55 నిమిషాల పోరాటం తర్వాత ఓటమి పాలై, భారత చాంలెంజ్‌కు ముగింపు పలికింది.

ఈ టోర్నమెంట్ ప్రారంభ దశలో స్టార్ షట్లర్లు పివి.సింధు, హెచ్.ఎస్. ప్రణయ్ కూడా మొదటి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టగా.. రెండవ రౌండ్‌కు చేరుకున్న లక్ష్య, సాత్విక్-చిరాగ్, అనుపమా ఓట‌ముల‌తో జపాన్ ఓపెన్‌లో భారతదేశం ఆశలు ముగిశాయి.

Leave a Reply