నెల రోజుల పాటు లోక్‌సభ, రాజ్యసభ సమావేశాలు
కీలకమైన ఎనిమిది బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్రం
పలు అంశాలపై ప్రశ్నించేందుకు ప్రతిపక్షాలు రెడీ
పహల్గామ్ ఉగ్ర దాడి, ఆపరేషన్ సిందూర్‌పై హాట్ హాట్ చర్చ
న్యూ ఢిల్లీ, ఆంధ్రప్రభ : (new delhi, andhra prabha )
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ( parliament monsoon sesion ) ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. సమావేశాలు ఆగస్టు 21 (August 221st ) వరకు జరగనున్నాయి. వాస్తవానికి ఈ సమావేశాలు ఆగస్టు 12వ తేదీ వరకే నిర్వహించాలని అనుకున్నారు. కానీ, తర్వాత ఆగస్టు 21వ తేదీ వరకు పొడిగించారు. ఈసారి సమావేశాలు హాట్ హాట్‌గా సాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పహల్గామ్ ఉగ్ర దాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత పార్లమెంట్ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ అంశాలను ప్రతిపక్షాలు కీలకంగా ప్రస్తావించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవంగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కానీ, అందుకు అధికార పార్టీ నిరాకరిచింది. ఇక.. బీహార్ ఎన్నికల ముందు ఈసీ చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌పై కూడా సభలో కాంగ్రెస్ లేవనెత్తే అవకాశం ఉంది.
ఎనిమిది బిల్లులు, కీలక చర్చలు..
ఈ సమావేశాల్లో ఎనిమిది బిల్లులు ప్రవేశపెట్టాలని కేంద్రం కసరత్తు చేస్తోంది. ఆదాయపు పన్ను సంస్కరణ, క్రీడా పాలన, భూ వారసత్వ సంరక్షణతో సహా 8 బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన పొడిగింపు కోసం ప్రభుత్వం ఉభయ సభల ఆమోదాన్ని కోరనుంది. ఫిబ్రవరి 13, 2025న రాష్ట్రపతి జారీ చేసిన ప్రకటన ద్వారా మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. అంతేకాకుండా.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై పార్లమెంటులో అభిశంసన తీర్మానం కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అలాగే నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు, జియోహెరిటేజ్ సైట్స్, జియో రెలిక్స్ (సంరక్షణ, నిర్వహణ) బిల్లు, మైన్స్ అండ్ మినరల్స్ (అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లు, నేషనల్ యాంటీ డోపింగ్ (సవరణ) బిల్లు, మణిపూర్ వస్తువులు, సేవల పన్ను (సవరణ) బిల్లులు ప్రవేశపెట్టే చాన్సుంది. కాగా, అధికార-ప్రతిపక్షాలు వ్యూహాలు, ప్రతి వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రతిపక్షాన్ని దీటుగా ఎదుర్కొనేందుకు అధికార పార్టీ సిద్ధపడుతోంది.

