రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మరోసారి తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేసింది. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు లీగల్ నోటీసు పంపారు.
భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రోహిత్ వేముల ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులకు రాంచందర్ రావు కూడా బాధ్యుడని ఆరోపించారు. బీజేపీ దళితులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, నిందితుడిని రాష్ట్ర అధ్యక్షుడిని చేసి ‘రివార్డు’ ఇచ్చిందని విమర్శించారు. రాంచందర్ రావు యూనివర్సిటీ అధికారులపై ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు.
గత మే నెలలో తెలంగాణ పోలీసులు దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టులో రాంచందర్ రావుతో సహా నిందితులందరికీ క్లీన్ చిట్ ఇచ్చారు. పోలీసులు నిగ్గు తేల్చిన కేసులో, నిర్దోషిగా తేలిన వ్యక్తిపై, అధికారంలో ఉన్న ఒక మంత్రి బహిరంగంగా ఇటువంటి ఆరోపణలు చేయడం అభ్యంతరకరమని బీజేపీ వాదిస్తోంది.
అయితే దీనిపై రామచంద్రరావు తీవ్రంగా స్పందించారు. భట్టి విక్రమార్క చేసిన ఈ వ్యాఖ్యలు తన పరువుకు నష్టం కలిగించేవిగా ఉన్నాయని.. ఈ “అనుచిత వ్యాఖ్యల”పై బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ డిప్యూటీ సీఎంకు లీగల్ నోటీసు పంపారు. లేకపోతే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించినట్లు తెలుస్తోంది. రాజకీయ లబ్ధి కోసం పాత కేసులను తిరిగి తెరిచి తమ నాయకులను చట్టవిరుద్ధంగా ఇరికించే ప్రయత్నాలను సహించబోమని బిజెపి స్పష్టం చేస్తోంది.