హైదరాబాద్ : ప్రముఖ నటి, పద్మభూషణ్ గ్రహీత బి.సరోజా దేవి మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) తీవ్ర సంతాపం ప్రకటించారు. చలనచిత్ర రంగంలో ముఖ్యంగా తెలుగు, కన్నడ, తమిళ సినిమాల్లో మరిచిపోలేని అనేక పాత్రలు పోషించారని గుర్తుచేసుకున్నారు. చలనచిత్ర రంగంలో వారు లేని లోటు పూడ్చలేనిదని, సరోజాదేవి (Saroja Devi) ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
చిత్రసీమపై బి సరోజది చెరగని ముద్ర – పవన్ కల్యాణ్
చలనచిత్ర రంగంలో బి సరోజది చెరగని ముద్ర అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.. ఆమె కన్నుమూశారని తెలిసి బాధపడ్డానని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాని పేర్కొన్నారు. 1955 నుంచి దాదాపు మూడు దశాబ్దాల పాటు తెలుగు (Telugu), కన్నడ (Kannada), తమిళ (Tamil) భాషా చిత్రాల్లో నటించి చిత్రసీమపై తనదైన ముద్రను వేశారన్ని తెలిపారు. భూకైలాస్, పాండురంగ మహత్యం, సీతారామ కళ్యాణం, జగదేకవీరుని కథ, శకుంతల, దానవీర శూర కర్ణ, ఆత్మబలం లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన విషయాన్ని పవన్ గుర్తు చేసుకున్నారు. ఆమె మృతికి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ఒక ప్రకటన ద్వారా తెలిపారు.