ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలంలో భక్తుల రద్దీ రోజురోజుకీ పెరుగుతోంది. శ్రీశైలం జలాశయం గేట్లు తెరుచుకోవడం, ఆలయం చుట్టూ నీటి మట్టం పెరగడం కారణంగా భక్తుల రాకపోకలు మరింతగా పెరిగాయి. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, దర్శనాల నిర్వహణ సజావుగా కొనసాగించడానికి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.
జూలై 15 (మంగళవారం) నుండి 19 వరకు మధ్యాహ్నం 1:45 నుంచి 3:40 వరకు ఉచిత స్పర్శ దర్శనం (Free Sparsha Darshan) నిలిపివేయనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. ఈ సమయంలో స్పర్శ దర్శనానికి క్యూలైన్‌లో నిలిచే భక్తులకు కేవలం అలంకార దర్శనమే అందుబాటులో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
ఈ నిర్ణయం కారణంగా భక్తులు అసౌకర్యానికి గురికాకుండా, ముందే తనయంగా యాత్రను ప్రణాళికాబద్ధంగా చేసుకోవాలని దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. భక్తులు ఈ వ్యవస్థను అర్థం చేసుకుని సహకరించాలని ఆయన కోరారు.