భద్రచలం వద్ద పెరుగుతున్న నీటిమట్టం
ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద ప్రవాహం
ఇంద్రావతి, కాళేశ్వరం నుంచి భారీగా ఇన్‌ఫ్లో
శబరిలోనూ పెరుగుతున్న వరద పోటు
నేటి ఉదయం 41 అడుగులకు చేరిన ప్రవాహం
43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక
ఇన్‌ఫ్లో తీరును పరిశీలిస్తున్న కేంద్ర జలవనరుల సంఘం
హెచ్చరికలు జారీ చేసిన అధికారులు
భద్రాచలం, కొత్తగూడెంలో కంట్రోల్ రూంలు
అత్యవసర స్థితిలో కాంటాక్ట్ కోసం హెల్ప్ లైన్
నిరంతరం పర్యవేక్షివేస్తున్న జిల్లా కలెక్టర్లు
సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ (Central Scale)
వానాకాలం వచ్చిందంటే అందరి చూపు భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి (godavari ) వరద పైనే ఉంటుంది. ప్రతి ఏడాది ఈ సమయంలో గోదావరికి వరద పోటెత్తుతుంది. ముఖ్యంగా ఎగువ ప్రాంతాల (uuper ) నుంచి వచ్చే వరదతో గోదావరి నదీ పరివాహక (river bed ) ప్రాంతాలు ముంపునకు గురవుతాయి. చినుకు పడితే చాలు ఎటునుంచి ముంపొచ్చి ముంచేస్తుందోనని పరీవాహక ప్రాంతవాసులు ఆందోళన చెందుతారు. ఎగువనున్న ఇంద్రావతి, కాళేశ్వరం వైపు నుంచి వరద రావటంతో పాటు దిగువనున్న శబరి పోటెత్తితే వరద ముంచెత్తడం ఖాయం. ప్రస్తుతానికి హెచ్చరిక స్థాయిలో ప్రవాహం లేకపోయినా ఐదు దశాబ్దాల వరదల సరళిని పరిశీలిస్తే.. జులైలోనూ పలుసార్లు గోదావరి కల్లోలం సృష్టించిందని తెలుస్తోంది.
క్రమేణా పెరుగుతున్న నీటిమట్టం..
జూన్ నుంచి గోదావరిలో జలకళ కనిపిస్తోంది. తీరంవెటం వర్షపాతం నమోదును చూసి నీటిమట్టం హెచ్చుతగ్గులకు గురవుతోంది. రెండ్రోజుల క్రితం 24 అడుగులు ఉండగా ఆ తర్వాత తగ్గుముఖం పట్టి 23అడుగులకు చేరింది. మళ్లీ కాళేశ్వరం వైపు నుంచి వరద తాకిడి ఎక్కువటంతో గురువారం రాత్రి 29 అడుగులకు నీటిమట్టం పెరిగింది. శుక్రవారం ఉదయం 8 గంటలకు 34 అడుగులు ఉండగా సాయంత్రం 4 గంటలకు 36.6 అడుగులకు చేరింది. శనివారం భద్రాచలం వద్ద గోదావరిలో నీటిమట్టం మరింత పెరుగుతూ.. ఉదయం 9 గంటలకు 40.9 అడుగులకు చేరింది. ఉదయం 10 గంటలకు 41 అడుగులకు నీటిమట్టం చేరుకుంది.
నిలిచిన రాకపోకలు..
విస్తా కాంప్లెక్స్ స్లూయాస్ నుంచి మురుగునీటిని మోటార్ల ద్వారా నదిలోకి తోడేందుకు కట్టపై పైపులు అమర్చారు. ఇటువైపు వాహనాల రాకపోకలను నిలిపేశారు. వరద ఉద్ధృతి ఇంకొంత పెరుగుతుందని కేంద్ర జలసంఘం అంచనా. 43 అడుగులకు నీటిమట్టం చేరితే మొదటి ప్రమాదక హెచ్చరిక అమల్లోకి రానుంది. 48 అడుగులకు రెండో ప్రమాద హెచ్చరిక, 53 అడుగులకు మూడో ప్రమాద హెచ్చరిక జారీ అవుతుందని అన్నారు.
దుమ్ముగూడెం వద్ద 18 అడుగులు..
దుమ్ముగూడెం హెడ్‌లాక్స్ వద్ద గోదావరి నటి నీటిమట్టం దాదాపు 18 అడుగులకు చేరుకుంది. సున్నంబట్టి ప్రధాన ఆనకట్ట వద్ద ఉద్ధృతంగా వరదనీరు ప్రవహిస్తోంది. వరద నీరు దుమ్ముగూడెం మినీ హైడల్ ప్రాజెక్టుకు చుట్టుముట్టింది. పర్ణశాల వద్ద స్నానఘట్టాలు మునిగిపోయాయి. సీతవాగులో సీతమ్మవారి నార చీరల ప్రదేశం, స్వామివారి సింహాసనం, సీతమ్మ విగ్రహం నీటమునిగాయి. భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతిని ఎస్పీ రోహిత్‌రాజు పరిశీలించారు.
ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి :
చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు, దివ్యాంగులను సురక్షితంగా ఉంచాలి.
నిత్యావసర సరకుల కొరత రాకుండా చూడాలి.
జీవాలను మెరక ప్రాంతాలకు తరలించాలి.
వరద ప్రమాదకరంగా ఉంటే పర్యాటకులు, భక్తులు నదిలోకి స్నానాలు ఆచరించకుండా చర్యలు తీసుకోవాలి.
అదే క్రమంలో బ్రిడ్జిపై సెల్ఫీలు దిగకుండా నిఘా పెంచాలి.
వరద ఉద్ధృతి నేపథ్యంలో పునరావాస కేంద్రాలు, గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్, పడవలు బృందాలను సిద్ధంగా ఉంచుతారు.
కంట్రోల్ రూం ఫోన్ నంబర్లు :
భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం: 08743-232444, 93479 10737
ఐటీడీఏ కార్యాలయం: 79952 68352
కొత్తగూడెం కలెక్టరేట్: 08744-241950, 93929 19743