Hyderabad | దశాబ్దాల పాటు విచారణలు.. ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్

హైదరాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : భార‌తీయ న్యాయ వ్య‌వ‌స్థ చాలా భిన్న‌మైన స‌వాళ్ల‌ను ఎదుర్కొంటున్న‌ద‌ని, దాన్ని స‌రి చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సీజేఐ బీఆర్ గ‌వాయ్ (CJI BR Gavai) తెలిపారు. హైద‌రాబాద్ (Hyderabad) లోని న‌ల్సార్ యూనివ‌ర్సిటీలో జ‌రిగిన స్నాత‌కోత్స‌వంలో పాల్గొని ఆయ‌న మాట్లాడారు. ఉన్న‌త విద్య కోసం విదేశాల‌కు వెళ్లే విద్యార్థులు స్కాల‌ర్‌షిప్‌ల (Scholarships) ఆధారంగా వెళ్లాల‌ని, కుటుంబంపై ఆర్థిక భారం మోప‌కుండా ఉండాల‌ని ఆయ‌న సూచ‌న చేశారు. మ‌న భార‌తీయ న్యాయ వ్య‌వ‌స్థను స‌మూలంగా మార్చాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, ఆ స‌వాళ్ల‌కు త‌గిన‌ట్లు పౌరులు రాణిస్తార‌ని భావిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

మ‌న దేశం, న్యాయ వ్య‌వ‌స్థ‌.. రెండూ భిన్న‌మైన స‌వాళ్ల‌ను ఎదుర్కొంటున్నాయ‌ని, కొన్ని కేసుల్లో విచార‌ణ ద‌శాబ్ధాల పాటు సాగుతుంద‌ని, కొన్నేళ్లు జైలు జీవితం అనుభ‌వించిన త‌ర్వాత వాళ్లు నిర్దోషుల‌ని కొన్ని కేసుల్లో తేలుతున్నాయ‌ని తెలిపారు. మ‌న వ‌ద్ద ఉన్న ఉత్త‌మ టాలెంట్ ఆ స‌మ‌స్య‌ల‌ను తీర్చుతుంద‌ని భావిస్తున్న‌ట్లు చెప్పారు. పాస్ అవుట్ అవుతున్న గ్రాడ్యుయేట్లు స‌మ‌గ్ర‌త‌పై దృష్టి పెట్టాల‌న్నారు.

స‌రైన మార్గ‌ద‌ర్శ‌కత్వం ఉంటే నైపుణ్యం సాధించ‌గ‌ల‌మ‌న్నారు. న్యాయవాదులు నిరంతరం తమను తాము నిరూపించుకోవాల్సి ఉంటుంద‌న్నారు. కోర్టు తీర్పులకు సంబంధించి సమగ్ర అవగాహన కలిగి ఉండాల‌ని సూచించారు. ప్రస్తుతం న్యాయవాద విద్యలో ప్రవేశించే వారి సంఖ్య పెరుగుతోంద‌ని, ఏఐ, డేటా ప్రైవసీ విషయంలో అనుకూల, ప్రతికూల ప్రయోజనాలు ఉన్నాయ‌ని అన్నారు. వృత్తిని, చేసే పనిని ప్రేమించాల‌ని, అప్పుడే సరైన ఫలితాలు పొందగలుగుతామ‌ని అన్నారు. ప్రస్తుతం న్యాయవ్యవస్థలో ఎన్నో సవాళ్లు ఉన్నాయ‌ని, కొన్ని కేసుల విచారణ దశాబ్దాల పాటు సాగడం ఆందోళనకరమ‌ని పేర్కొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, సుప్రీంకోర్టు జ‌డ్జీ పీఎస్ న‌ర్సింహా, తెలంగాణ సీజే సుజోయ్ పౌల్‌ స్నాత‌కోత్స‌వంలో పాల్గొన్నారు.

ఈ స్నాతకోత్సవంలో వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులకు న్యాయమూర్తులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ గోల్డ్ మెడల్స్ బహూకరించారు. జస్టిస్ సుజయ్ పాల్ గారు డాక్టరేట్ సాధించిన వారితో పాటు ఎల్ఎల్ఎం, ఎంబీఏ, బీఏ ఎల్ఎల్ బీ (హానర్స్) పీజీ డిప్లమా పొందిన విద్యార్థినీ విద్యార్థులకు పట్టాలు అందజేశారు. చట్ట సంబంధమైన వివిధ అంశాలపై నిపుణులు రాసిన పలు పుస్తకాలను ఈ వేదికగా ఆవిష్కరించారు.

Leave a Reply