AP | కొరడా జులిపిస్తున్న ఈగల్..

  • ఫలితాలు ఇస్తున్న ఆపరేషన్ ఫ్లష్ అవుట్…
  • పోలీస్, సిఆర్పి ఆర్పీఎఫ్ ఈగల్ టీం సంయుక్త ఆపరేషన్…
  • రైళ్లలో విస్తృత తనిఖీలు…
  • మొన్న భారీ ఎత్తున గంజాయి, నేడు చాక్లెట్ గంజాయి స్వాధీనం…

(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాదకద్రవ్య రహిత ఆంధ్ర ప్రదేశ్ కోసం చేస్తున్న పలు ఆపరేషన్లు విజయవంతం అవుతున్నాయి. రాష్ట్రంలో గంజాయి, మత్తు పదార్థాల రవాణా, క్రయవిక్రయాలను నియంత్రించేందుకు ప్రత్యేక ఈగల్ టీం సైతం స్థానిక పోలీస్, ఆర్పిఎఫ్, సిఆర్పిఎఫ్ తో కలిసి సంయుక్త ఆపరేషన్ చేస్తుంది.

ఆపరేషన్ ఫ్లష్ఔట్ లో భాగంగా రైల్వే, బస్, వంటి కీలక రవాణా వ్యవస్థలు, ప్రధాన రహదారులపై తనిఖీలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంలో పెద్ద ఎత్తున గంజాయి సైతం పట్టుపడుతోంది. తాజాగా లా అండ్ ఆర్డర్ పోలీస్, జిఆర్పిఎఫ్, ఆర్ పి ఎఫ్, ఈగల్ టీం సంయుక్తంగా రైల్వేలలో విస్తృత తనిఖీలు చేపడుతుంది.

మరి ముఖ్యంగా విజయవాడ మీదుగా పలు రాష్ట్రాలకు వెళ్తున్న, వస్తున్న రైళ్లలో విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా గడిచిన వారం రోజుల క్రితం ఒరిస్సా ప్రాంతం మీదుగా ఏపీలోకి ప్రతిరోజు వస్తున్న కోరమండల్ ఎక్స్ప్రెస్ లో తనిఖీలు నిర్వహించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడింది.

గంజాయి రవాణా పై ఉక్కు పాదం మోపుతున్న నేపథ్యంలో తెలివి మీరున నిందితులు గంజాయిని చాక్లెట్ రూపంలో తయారుచేసి రవాణా చేస్తున్నారు. స్పష్టమైన సమాచారం వస్తున్న నేపథ్యంలో శుక్రవారం మరోసారి సంయుక్త ఆపరేషన్ నిర్వహించిన ఈగల్ టీం ఏలూరు నుండి విజయవాడ వరకు కోరమండల్ ఎక్స్ప్రెస్ లో ప్రతి భోగిని, ప్రతి ప్రయాణికున్ని, ప్రతి లగేజ్ ను విస్తృతంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంలో వారికి చాక్లెట్ రూపంలో తయారుచేసి రవాణా చేస్తున్న గంజాయిని పట్టుకున్నారు. గంజాయిని ముడి పదార్థం గా తయారుచేసి చాక్లెట్ రూపంలో ప్యాక్ చేసి ఎవరికి అనుమానం రాకుండా రవాణా చేస్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీటి వివరాలను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ విజయవాడ డివిజన్ ఇంచార్జ్ షణ్ముగ వడివేలు వివరించారు.

అక్రమంగా చాక్లెట్ రూపంలో రవాణా చేస్తున్న 220 గ్రాముల ఉన్న 40 చాక్లెట్లను స్వాధీనం చేసుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని చెప్పారు. నిత్యం రైళ్లలో తనిఖీ కొనసాగుతూ ఉంటుందని వెల్లడించారు. ఈ తనిఖీలలో ఈగల్ టీమ్ ఎస్ఐ వీరాంజనేయులు తో పాటు స్థానిక పోలీసులు, ఆర్పిఎఫ్ సిఆర్పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply