- మలుపు తిప్పిన బుమ్రా…
ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతోంది. రెండో రోజు ఓవర్‌నైట్ స్కోరు 251/4తో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్… లంచ్ సమయానికి 353/7గా నిలిచింది. ప్రస్తుతం క్రీజులో ఉన్న స్మిత్ – కార్సే 8వ వికెట్‌కు కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పగా… ఆతిథ్య జట్టు 400 పరుగుల మార్కు వైపు పరుగులు పెడుతోంది.
కాగా. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ముగియగా, ఇరు జట్లు చెరో విజయం సాధించి సిరీస్‌ను సమానంగా నిలిపాయి. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించాడు. తొలి రోజు ఆటలో ఆతిథ్య జట్టు నిలకడగా ఆడి 251/4తో ముగిసింది. జో రూట్ నిలకడగా కీలక ఇన్నింగ్స్‌కు ఆడి భారీ స్కోర్ కు పునాది వేశాడు.
రూట్ సెంచరీ, బుమ్రా దెబ్బ…
ఇక రెండో రోజు ఆటలో జో రూట్ తన క్లాసిక్ ఇన్నింగ్స్ ను కొనసాగిస్తూ.. 192 బంతుల్లో 10 బౌండరీలతో 100 పరుగులు పూర్తి చేశాడు. అయితే 104 పరుగుల వద్ద బుమ్రా చెలరేగి రూట్‌ను పెవిలియన్ చేర్చాడు. అంతకుముందు, జోరూట్ తో కలిసి 88 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన కెప్టెన్ స్టోక్స్ కూడా బుమ్రా బౌలింగ్‌లో 44 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. రూట్ తర్వాత, క్రిస్ వోక్స్ కూడా ఖాతా తెరవకుండానే బుమ్రాకు వికెట్ ఇచ్చేశాడు. బుమ్రా ఇప్పటివరకు తన స్పెల్‌లో నాలుగు కీలకమైన వికెట్లు తీసి ఇంగ్లాండ్‌పై కొంత ఒత్తిడి పెంచాడు. దీనితో, ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ వేగం కొంతవరకు తగ్గింది.
ఇక లంచ్ సమయానికి వికెట్ కీపర్ జేమీ స్మిత్ అర్ధశతకం సాధించి 51 పరుగులతో క్రీజులో నిలిచాడు. టెయిలెండర్ బ్రైడాన్ కార్స్ 33 పరుగులతో స్మిత్ కు మంచి భాగస్వామ్యం అందిస్తున్నాడు. వీరిద్దరూ కీలక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తే ఇంగ్లాండ్ 400 రన్ మార్క్ దాటే అవకాశం ఉంది.
మరోవైపు మిగిలిన మూడు వికెట్లను త్వరగా పడగొట్టి ఇంగ్లాండ్ స్కోరును 400 కంటే తక్కువగా కట్టడి చేయడానికి టీమిండియా ప్రయత్నిస్తుంది. ఆ తర్వాత తమ బ్యాటింగ్ శక్తిని చూపి పెద్ద స్కోర్ చేయాలని చూస్తుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే, సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లనుంది.
లంచ్ సమయానికి స్కోరు :
ఇంగ్లండ్ : 353/7 (105 ఓవర్లు)
(స్మిత్ 51, కార్సె 33)
భారత్ బౌలింగ్:
బుమ్రా 4/63
నితీశ్ కుమార్ రెడ్డి 2/62
జడేజా 1/29