Vijayawada | భగవతీ శాకాంబరీ నమోస్తుతే….

  • అట్టహాసంగా శాకంబరీ ఉత్సవాలు..
  • మూడు రోజులు కనులవిందుగా మహోత్సవాలు..
  • చివరి రోజు పండ్లతో అలంకరణ…
  • పూర్ణాహుతితో ఉత్సవాలు పరిసమాప్తం…
  • పౌర్ణమి రోజు స్వర్ణ కవచాలంకరణలో కనకదుర్గమ్మ..
  • అశేషంగా తరలివచ్చిన భక్తులు…
  • అమ్మ నామస్మరణతో కిటకిటలాడిన క్యూ లైన్లు…
  • పౌర్ణమి, ఆషాడం, శాకంబరీ ఉత్సవాలతో…
  • పూర్తి ఆధ్యాత్మిక శోభ తో ఇంద్రకీలాద్రి…
  • తనివితీర కదంభ ప్రసాదం స్వీకరణ..


(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : భక్తుల అంతులేని కోర్కెలు తీర్చే కల్పవల్లిగా, సకల జీవరాశికి ఆకలి, దప్పికలను తీర్చుతూ, సర్వ రోగాలను నియంత్రించే జగన్మాత కనకదుర్గమ్మ (Kanakadurgamma) ప్రకృతి మాత శాకాంబరీ దేవిగా దర్శనమిస్తోంది. శాకాంబరీ దేవి (Shakambari Devi)ని భక్తితో పూజించిన, స్తోత్రం పఠించిన, ధ్యానించిన, నమస్కరించిన, జపించిన ఆజన్మాంతం, తరిగిపోని అన్న పానీయాలు అమృతం లభిస్తుందని ఇతిహాసాలు చెబుతుంటాయి. ఈ నేపథ్యంలో భక్తుజనులందరూ భగవతి శాకంబరీ నమోస్తుతే అంటూ అమ్మవారిని కీర్తిస్తూ, శాకంబరీ దేవి అవతారంలో ఉన్న కనకదుర్గమ్మ వారిని దర్శించుకుంటున్నారు. విజయవాడ (Vijayawada)లోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో మూడు రోజులపాటు అత్యంత వైభవంగా జరుగుతున్న శాకంబరీ ఉత్సవాలు చివరి రోజు గురువారం పూర్ణాహుతితో ముగిశాయి. శ్రీ విశ్వ వాసు నామ సంవత్సర ఆషాడం మాసం ఈనెల 8వ తేదీన నుండి ప్రారంభమైన ఈ శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ వారి ప్రధాన ఆలయంతో పాటు ఆలయాలను కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. మూడు రోజులపాటు వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో అలంకరణ చేయగా చివరి రోజు గురువారం వివిధ రకాల పండ్లతో అమ్మవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఆలయ ప్రాంగణమంతా పచ్చని ఆకుకూరలు కూరగాయలతో మిరమిట్లు గొలిపే అందంతో కనిపిస్తోంది.

స్వర్ణకవచాలంకరణ శాకంబరీ దేవిగా కనకదుర్గమ్మ….
ఆషాడ పౌర్ణమి, శాకాంబరి ఉత్సవాల సందర్భంగా కనకదుర్గమ్మ వారు స్వర్ణకవచాలంకరణ శాకంబరీ దేవిగా భక్తులకు గురువారం దర్శనమిచ్చారు. ప్రతి పౌర్ణమి రోజున కనకదుర్గమ్మ స్వర్ణకవచాలంకరణ లో భక్తులకు దర్శన భాగ్యం కలుగుతుంది. అయితే ప్రస్తుత శాకంబరీ ఉత్సవాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో అమ్మవారికి స్వర్ణకవచాలంకరణతో పాటుగా శాకంబరీ దేవిగా అలంకరించారు. శాకంబరి ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి డ్రై ఫ్రూట్స్ తో చేసిన పూలదండలు అలంకరణ చేశారు. ఈ అలంకరణలో ఉన్న కనకదుర్గమ్మని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రి కి వివిధ మార్గాలలో చేరుకుంటున్నారు. అసలే పౌర్ణమి, ఆషాడ మాసం, అందులోనూ శాకంబరీ ఉత్సవాలు మూడో కలిసి ఒకేరోజు రావడంతో అమ్మవారి కరుణాకటాక్షాల కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో క్యూ లైన్ లన్నీ కిక్కిరిసి కనిపిస్తున్నాయి. నిత్యం అమ్మవారి నామస్మరుడు చేస్తూ భక్తులు అమ్మవారిని మనసారా చూసి తరిస్తున్నారు. శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా అతి ముఖ్యమైన కదంభ ప్రసాదాన్ని భక్తులు ఎంతో ఇష్టంగా స్వీకరిస్తున్నారు. ఉచిత ప్రసాదంతో పాటు, అమ్మవారి అన్న ప్రసాదంలో కూడా భక్తులకు ఈ కదంభ ప్రసాదాన్ని అందజేస్తున్నారు.

పూర్ణాహుతితో ముగిసిన ఉత్సవాలు….
మూడు రోజులపాటు అత్యంత వైభవంగా కొనసాగిన శాకంబరీ ఉత్సవాలు చివరి రోజు గురువారం పూర్ణాహుతితో పరిసమాప్తి అయ్యాయి. ఇంద్రకీలాద్రిపై ఈ మూడు రోజులపాటు కనకదుర్గమ్మ వారు శాకంబరీ దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చి కరుణాకటాక్షాలు అందించారు. గురువారం చివరి రోజు ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో కార్యనిర్వహణ అధికారి శినా నాయక్ దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు, మంత్రోచ్ఛరణల మధ్య పూర్ణాహుతి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు, ఇతర పురోహితులు నిర్వహించారు. మధ్య ఈ ఉత్సవాలలో భాగంగా అమ్మవారి అలంకరణతో పాటు ఆలయాలను అలంకరణ కోసం టన్నులకొద్దీ కూరగాయలు ఆకుకూరలు పండ్లను వినియోగించారు. ఉమ్మడి కృష్ణ గుంటూరు పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన రైతులు వ్యాపారస్తులు జాతలు ముందుకు వచ్చి విరాళంగా వీటిని అందజేశారు. మూడు రోజులపాటు అమ్మవారికి యాలకులు, వివిధ రకాల పళ్ళు, డ్రై ఫ్రూట్స్ తో కూడిన అలంకరణ చేశారు. అమ్మవారి ఆలయ పరిసరాల్లో కూరగాయలు, పండ్లను తీసుకునే ఇంటికి వెళ్లేందుకు భక్తులు ఆరాటపడ్డారు.

Leave a Reply