శ్రీశైలం, జూలై 8 (ఆంధ్రప్రభ) : నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయంలో జలహారతి కార్యక్రమంలో పాల్గొను నిమిత్తం మంగళవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) శ్రీశైలంకు చేరుకున్నారు. శ్రీశైలం (Srisailam) లోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి మంత్రులు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. ద్వాదశాలలో రెండవ జ్యోతిర్లింగం, ఆరవ అష్టాదశ శక్తిపీఠం, ఇలలో వెలసిన కైలాసంగా ప్రసిద్ధి చెందిన శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి (Sri Bhramaramba Mallikarjuna Swamy) వార్ల దర్శనార్థం మంగళవారం ఆలయానికి చేరుకున్నారు. ఈసందర్భంగా ఆలయ సంప్రదాయం ప్రకారం ముఖ్యమంత్రికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేదమంత్రాలతో స్వామివారి దర్శనార్థం ఆలయంలోకి వెళ్లారు.
ఆలయంలో ప్రథమంగా రత్నగర్భ గణపతిని దర్శించుకున్న సీఎం చంద్రబాబునాయుడు అనంతరం శ్రీశైల మల్లికార్జున స్వామిని, శ్రీ భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకుని అర్చన కార్యక్రమంలో పాల్గొని భక్తిశ్రద్ధలతో ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో రుద్ర హోమం పూర్ణాహుతిలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారి మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈకార్యక్రమంలో మంత్రులు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, దేవదాయ శాఖ సెక్రెటరీ వినయ్ చంద్, కమిషనర్ రామచంద్ర మోహన్, జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, ఆలయ ఈవో శ్రీనివాసరావు, జేఈవో, పీఆర్వోలు, ఆలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.