AP | సీఎం చంద్రబాబు సమక్షంలో నాలుగు కంపెనీలతో కీలక ఒప్పందాలు !

  • కుప్పంలో రూ.1617 కోట్ల పెట్టుబడులు
  • యువతకు నైపుణ్యాభివృద్ధి కేంద్రం
  • పారిశ్రామిక రంగానికి నూతన ఉత్సాహం
  • వ్యవసాయ ఆధారిత రంగానికి బలమైన తోడు

చిత్తూరు : కుప్పం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో నాలుగు ప్రముఖ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం రూ.1617 కోట్ల విలువైన పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుంది. ఈ ఒప్పందాలు కుప్పం అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలవనున్నాయి. స్థానిక యువతకు శిక్షణ, ఉపాధి అవకాశాల పెరుగుదల, పరిశ్రమల స్థాపన ద్వారా ప్రాంతానికి నూతన ఉత్సాహాన్ని తీసుకురానున్నాయి.

మొదటగా, హిందాల్కో జనసేవా ట్రస్ట్ తో భాగస్వామ్యంగా కుప్పంలో యువత కోసం నైపుణ్యాభివృద్ధి కేంద్రంను ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రం ద్వారా యువతకు అవసరమైన సాంకేతిక శిక్షణ లభించడంతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా ఏర్పడనున్నాయి.

కుప్పం పారిశ్రామిక రంగానికి కొత్త ఊపునిచ్చే ప్రయత్నంలో, ఈ-రాయిస్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో రూ. 200 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో, ఈ-ఆటోలు, ఈ-బైక్‌లు, ఈ-స్వీపింగ్ ఎలక్ట్రిక్ యంత్రాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్నారు.

అలాగే, ఏస్ ఇంటర్నేషనల్ సంస్థతో రూ.525 కోట్ల పెట్టుబడితో సమీకృత పాల ఉత్పత్తులు, పోషకాహార ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని స్థాపించేందుకు ఒప్పందం కుదిరింది. ఇది ప్రాంతీయ వ్యవసాయ ఉత్పత్తుల విలువను పెంచడంతో పాటు రైతులకు ప్రయోజనకరంగా మారనుంది.

ఎస్వీఎఫ్ సోయా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో రూ.372.8 కోట్ల పెట్టుబడితో మరో పరిశ్రమను ప్రారంభించేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఈ పరిశ్రమ వ్యవసాయ ఆధారిత రంగానికి బలాన్ని చేకూర్చనుంది.

ఈ ఒప్పందాలన్నీ కుప్పం ప్రాంత అభివృద్ధిని వేగవంతం చేయడమే కాకుండా, స్థానిక యువతకు ఉపాధి కల్పనలో కీలకపాత్ర పోషించనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం సుసూక్త పారిశ్రామిక అభివృద్ధి దిశగా ముందుకెళ్తోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply