హైదరాబాద్ : ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అధికారులు మరోసారి దూకుడు పెంచారు. హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ (Shiva Balakrishna) నివాసాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఆయన ఆఫీసులు, నివాసాల్లో దాడులు చేస్తున్నారు. శివబాలకృష్ణతో పాటు ఆయన సోదరుడు నవీన్ కుమార్ (Naveen Kumar) నివాసంలోనూ సోదాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గతంలో శివబాలకృష్ణ సస్పెండ్ అయిన విషయం తెలిసిందే.
శివ బాలకృష్ణ గతంలో మెట్రో రైల్ చీఫ్ జనరల్ మేనేజర్‌గా, రెరా ఇంచార్జి కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఏసీబీ కేసుల (ACB cases) నేపథ్యంలో శివబాలకృష్ణను హెచ్ఎండీఏ మెట్రో పాలిటన్ కమిషనర్ దాన కిశోర్ (Dana Kishore) సస్పెండ్ చేశారు. ఇప్పటికే శివబాలకృష్ణ బంధువుల పేరిట 214 ఎకరాల వ్యవసాయ భూములు రిజిస్టర్ అయినట్టు తేలిందని ఏసీబీ అధికారులు తెలిపారు. జనగామ జిల్లాలో 102, యాదాద్రి భువనగిరి జిల్లాలో 66, నాగర్‌కర్నూల్ జిల్లాలో 38, సిద్దిపేటలో 7 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు వెల్లడించారు. శివబాలకృష్ణ అక్రమాల వెనుక హెచ్‌ఎమ్‌డీఏ, మెట్రోరైల్ అధికారుల పాత్రపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.