TG | ఆర్ అండ్ బి శాఖ పనుల పురోగతిపై కోమటి రెడ్డి స‌మీక్ష‌

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆర్ అండ్ బి శాఖ పనుల పురోగతిపై అధికారులతో (మంగళవారం) ఎర్రమంజిల్‌లో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ముఖ్యంగా పనుల నాణ్యత, వేగం, ప్రజల అవసరాల మేరకు సేవల అమలుపై దృష్టి సారించారు.

ఫీల్డ్ స్థాయిలో అధికారుల దృఢ నిఘా అవసరం

పనుల్లో పురోగతికి చీఫ్ ఇంజనీర్ స్థాయి అధికారుల ఫీల్డ్ విజిట్ తప్పనిసరి అని స్పష్టం చేశారు. ప్రతి సమీక్షా సమావేశంలో పురోగతిని స్పష్టంగా చూపించాల్సిన బాధ్యత అధికారులదేనని అన్నారు. శాఖపై తనిఖీలు, సమీక్షలు నిరంతరంగా జరుపుతానని చెప్పారు.

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో జరిపిన సంప్రదింపుల ద్వారా రాష్ట్ర వాటా క్రింద రూ. 300 కోట్ల CRIF నిధుల కోసం తనయంతంగా కృషి చేశానని మంత్రి వెల్లడించారు. నిధుల విడుదలతో బిల్లు చెల్లింపులు వేగంగా జరుగుతాయని, అదే స్థాయిలో పనుల వేగం కూడా ఉండాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) రోడ్లపై మేనేజ్డ్ దృష్టి

హ్యామ్ విధానంలో చేపట్టబోయే పది ప్యాకేజీల రహదారి పనుల సాధ్యాసాధ్యాలపై తక్షణమే అధ్యయనం చేయాలని ఇఎన్సి జయ భారతికి సూచించారు. రహదారి ప్రమాదాలను నివారించేందుకు బ్లాక్ స్పాట్లు, వర్టికల్ కర్వులు ముందుగానే గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు.

విస్తృత సమీక్ష, ప్రాధాన్య ప్రాజెక్టులపై దృష్టి

తెల్లాపూర్, అమీన్‌పూర్, సంగారెడ్డి, మణ్చాల, చౌటుప్పల్, చిట్యాల, భువనగిరి, హలియ, మల్లేపల్లి రహదారుల పురోగతిపై ప్రత్యేకంగా చర్చించారు. ప్రతి మండల కేంద్రాన్ని జిల్లా కేంద్రానికి కనెక్ట్ చేయాలనే లక్ష్యంతో భూ సమస్యల నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వివరించారు.

పినిషింగ్ స్టేజ్ పెండింగ్ లో ఉన్న ఆర్వోబిలు, మెడికల్ కాలేజీలు, టిమ్స్ హాస్పిటల్స్, కలెక్టరేట్లు వెంటనే పూర్తి చేసేందుకు ప్రత్యేకంగా యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

CM రేవంత్ రెడ్డి సూచనలతో వేగవంతమైన పనులు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్ అండ్ బి శాఖ నిధుల విడుదలకు సానుకూలంగా ఉన్నారని మంత్రి వెల్లడించారు. హాస్పిటల్స్, రహదారులు వంటి ప్రజావసర నిర్మాణాలు త్వరగా పూర్తవాలన్న బాధ్యత అధికారులపై ఉందని గుర్తు చేశారు. మెడికల్ కాలేజీలు, ఆర్వోబిలు, టిమ్స్ హాస్పిటల్స్, కలెక్టరేట్లు వంటి పబ్లిక్ ప్రాజెక్టులు తక్షణమే పూర్తిచేయాలని అధికారులకు సూచించారు.

శాఖలో ఎన్నడూ లేని విధంగా సీఎం సహకారంతో ప్రమోషన్లు, పోస్టింగ్స్ మంజూరయ్యాయని, ఉద్యోగులు హుషారుగా పనిచేసి శాఖకు మంచి పేరు తీసుకురావాలని మంత్రి ఆకాంక్షించారు. ఇటీవల పదోన్నతులు పొందిన అధికారులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు అందుకున్నారు.

రెండు రోజుల్లో డీపీఆర్ సమీక్ష !

హ్యామ్ రహదారి పథకాల డీపీఆర్, టెండర్ ప్రక్రియపై రెండు రోజుల్లో పూర్తి స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి ప్రకటించారు. గురువారం జరగనున్న సమీక్షకు అన్ని వివరాలతో సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో ఇంచార్జి ఇఎన్సి టి. జయ భారతి, సీఈలు మోహన్ నాయక్, లక్ష్మణ్, రాజేశ్వర్ రెడ్డి, లింగారెడ్డి, ఇతర ఎస్.ఈలు, ఈ.ఈలు పాల్గొన్నారు.

Leave a Reply