బర్మింగ్‌హామ్ ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో భుదవారం (జూలై 2) నుండి భారత్-ఇంగ్లాండ్ రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం మ్యాచ్ సాయంత్రం 3:30 గంటలకు మొదలవుతుంది. ఈ మ్యాచ్‌ను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్, డీడీ స్పోర్ట్స్, జియోహాట్‌స్టార్‌లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.
కాగా, తొలి టెస్ట్‌లో ఓటమిని ఎదుర్కొన్న భారత్.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో వెనుకబడింది. హెడింగ్లీలో జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లాండ్ భారీ ఛేజింగ్‌ను సాధించి, తమ రెండో అత్యధిక విజయవంతమైన పరుగుల ఛేజ్‌ను నమోదు చేసింది. ఈ విజయంతో వారి హోం గ్రౌండ్ అడ్వాంటేజ్, బజ్‌బాల్ అటాకింగ్ మైండ్‌సెట్‌కు మళ్లీ సాక్ష్యంగా నిలిచింది.
భారత్‌కు కలిసిరాని ఎడ్జ్‌బాస్టన్
రెండో టెస్టు మ్యాచ్ బర్మింగ్‌హామ్ ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో జరగనుండగా.. ఈ మైదానం భారత్‌కు ఇప్పటివరకు ఎంతో అనుకూలంగా నిలవలేదు. భారత్ ఇక్కడ ఆడిన ఎనిమిది టెస్ట్‌లలో ఏడు ఓటములు ఎదుర్కొంది. కేవలం 1986లో కపిల్ దేవ్ నాయకత్వంలో మ్యాచ్ డ్రా చేసుకోవడమే జట్టుకు చిన్న ఊరటనిచ్చింది. ఈ నేపథ్యంలో, రెండు టెస్ట్‌ల సిరీస్‌లో తిరిగి పోటీకి రానున్న భారత్ ఈ మ్యాచులో గట్టి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది.
తొలి టెస్టులో సెంచరీల వర్షం..
హెడింగ్లీలో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ తమ రెండవ అత్యధిక విజయవంతమైన పరుగుల రికార్డును పూర్తి చేసి భారత్ బౌలింగ్ విభాగంపై ఒత్తిడి పెంచేసింది. అయితే, తొలి టెస్టులో ఆశించిన ఫలితం రాకపోయినా.. టీమిండియా బ్యాటింగ్ విభాగం ప్రశంసనీయమైన ప్రదర్శనను కనబరిచింది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు ఐదు సెంచరీలు సాధించి టెస్ట్ చరిత్రలో అరుదైన ఘనతను సాధించారు. ఈ ఘనత జట్టుకు గర్వకారణమే కాకుండా భవిష్యత్తుకు ఆత్మవిశ్వాసాన్ని కూడా ఇస్తుంది.
తొలి టెస్టులో బ్యాటింగ్ వీరులు !
తొలి ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ – 101 (159 బంతులు, 16 ఫోర్లు), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ – 147 (227 బంతులు, 19 ఫోర్లు, 1 సిక్స్), రిషభ్ పంత్ – 134 (178 బంతులు, 12 ఫోర్లు, 6 సిక్సులు) సెంచరీలు సాధించగా.. రెండో ఇన్నింగ్స్ లో కేఎల్ రాహుల్ – 127 (227 బంతులు), రిషభ్ పంత్ – 118 (140 బంతులు, 15 ఫోర్లు, 3 సిక్సులు) సెంచరీలో నమోదు చేస ఆకట్టుకున్నారు.
బ్యాటింగ్‌లో ఇంతటి డామినెన్స్ చూపించినా.. బౌలింగ్ లేకపోవడం వల్ల భారత్ ఓటమి నుండి తప్పించుకోలేకపోయింది. ఫీల్డింగ్ లోపాలు, లైన్-లెంగ్త్ స్థిరంగా లేకపోవడం, ఒత్తిడి నిర్వహణలో అనుభవరాహిత్యం కలిసి భారత పతనానికి దారితీశాయి. ఆ లోపాలను అధిగమించి, భారతదేశం మరింత ఉత్సాహంతో, విజయంపై కొత్త దృష్టితో రెండవ టెస్ట్‌లోకి అడుగుపెడుతుంది.
ఇంగ్లాండ్ ధీమా…
ఇంగ్లాండ్ జట్టు విజయోత్సాహంతో రెండో టెస్ట్‌లోకి అడుగుపెడుతోంది. వారి విజయవంతమైన ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎటువంటి మార్పులూ చేయలేదు. ఇక స్పీడ్ స్టర్ జోఫ్రా ఆర్చర్ తిరిగి జట్టులోకి వచ్చినా, కుటుంబ విషయాల కారణంగా ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండడంలేదు.
ఇక రేపటి మ్యాచ్ టీమిండియాకు సిరీస్‌లో తిరిగి పోటీకి రావడానికి ఒక కీలక అవకాశం. ఇంగ్లాండ్ జట్టుకు సొంతగడ్డపై ఆధిక్యం ఉన్నప్పటికీ, భారత్ యువ ప్రతిభ, అనుభవంతో గట్టి పోటీని ఇస్తుంది. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగే ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఒక థ్రిల్లింగ్ కంటెస్టుగా నిలవనుంది.
తుది జట్లు
భారత్ తుది జట్టు (అంచనా) : యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్ (సి), రిషబ్ పంత్ (వికెట్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా/అర్ష్‌దీప్ సింగ్/ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ
ఇంగ్లాండ్ ప్లేయింగ్ XI : జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్సే, జోష్ టంగ్, షోయబ్ బషీర్
హెడ్-టు-హెడ్ రికార్డ్ :
- ఆడిన మ్యాచ్‌లు: 137
- ఇంగ్లాండ్ విజయం: 52
- భారతదేశం విజయం: 35
- డ్రా: 50