జన్నారం,జూన్ 30 (ఆంధ్రప్రభ): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల టైగర్ రిజర్వ్ లోని మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ డివిజనల్ అడవుల్లో పర్యాటకులు తిరిగే జంగల్ సఫారీ వాహనాలను నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఎ) నిబంధనల మేరకు 3 నెలలు నిషేధించారు.
జంగల్ సఫారీ వాహనాలను ఎన్టీసీఎ ఆదేశాల మేరకు నిలిపివేసినట్లు స్థానిక ఎఫ్డీఓ ఎం.రామ్మోహన్ సోమవారం తెలిపారు.ఈ ప్రాంతానికి వచ్చే పర్యాటకులు ఈ విషయాన్ని గ్రహించాలని ఆయన సూచించారు
జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు రిజర్వ్ ఫారెస్ట్ లోని అడవుల్లో పర్యాటకుల రాకపోకల రాకపోకలను సాగించకూడదని అటవీశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిలిపివేశారు.ఈ తరుణంలో అడవుల్లోని పెద్ద పులులు,చిరుత పులులు,ఇతర కొన్ని వన్యప్రాణులు పునరుత్పత్తి కోసం బ్రీడింగ్ చేసుకుంటాయి.అందుకోసమే పర్యాటకులు అడవుల్లోకి వెళ్ళినట్లయితే పెద్దపులుల, చిరుతపులుల, కొన్ని రకాల వన్యప్రాణుల భంగం కలుగుతుందని,వర్షాకాలం కనుక అడవుల్లోని రోడ్లు బురదమయం అవుతాయని, పర్యాటకులకు ఇబ్బందులు కలగకూడదనే సదుద్దేశంతో ఆటవీశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించి సఫారీ వాహనాల రాకపోకలను నిషేధించారు. ప్రతి సంవత్సరం ఈ కాలంలో 3 నెలలు సఫారీలను వాహనాలను నిలిపివేస్తున్నారు
.రిజర్వ్ ఫారెస్ట్ అడవుల్లోని అందాలను తిలకించడానికి తెలంగాణ టూరిజం శాఖ హరిత రిసాల్ట్ 2 సఫారీ వాహనాలను,అటవీశాఖ 4 జంగిల్ సఫారీ వాహనాలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలో పర్యాటక కేంద్రమైన కవ్వాల టైగర్ రిజర్వ్ లోని అడవుల అందాలను ప్రతి సంవత్సరం దేశ,విదేశాల నుంచి,తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాల నుంచి వేల మంది పర్యటకులు వచ్చి అడవుల అందాలను తిలకించి ఎంతో పరవశించి వెళ్ళిపోతున్నారు.3 నెలలు జంగల్ సఫారీ వాహనాలను అడవుల్లోకి రాకపోకలను నిలిపివేయడంతో అభయారణ్యం బోసిపోనుంది.వచ్చే అక్టోబర్ 1 నుంచి మళ్లీ సఫారీ వాహనాలను అడవుల్లోకి అనుమతిస్తారు