WGL | ప్రజా ప్రభుత్వంలో పేదవాడి సొంతింటి కలసాకారం : ఎమ్మెల్యే గండ్ర

ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి: పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శుక్రవారం భూపాలపల్లి మండలంలోని అటవీ గ్రామాలైన కమలాపూర్, నాగారం, ఆజంనగర్, నందిగామ, పంబాపూర్, దూదేకులపల్లి, గొల్లబుద్దారం, రాంపూర్, ఆముదాలపల్లి, కొంపల్లి, గుడాడ్ పల్లి, గొర్లవీడు, వజినేపల్లి, నేరేడుపల్లి, ఎస్.యం కొత్తపల్లి, మోరంచపల్లి, శ్యాంనగర్ గ్రామాలల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే చేతులమీదుగా శంకుస్థాపన చేశారు. అనంతరం 19 గ్రామాల్లో మొదటి విడతలో 364 ఇండ్లకు ముగ్గు పోశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు మంజూరీ పత్రాలను జిల్లా హౌసింగ్ పీడీ లోకీలాల్ ఇతర అధికారులతో కలిసి ఎమ్మెల్యే జిఎస్ఆర్ పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ఏర్పాటు చేసిన సభా వేదికలల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ… పేదవాడి సొంతింటి కలను నిజం చేయడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలకు ఉపయోగపడే పని చేస్తే వారి నుంచి వచ్చే స్పందన బాగుంటుందన్నారు. గత పాలకులు ఎమ్మెల్యే నివాసాలు, ప్రభుత్వ భవనాల మీద పెట్టిన శ్రద్ధ పేద ప్రజల ఇండ్లపై పెట్టలేదని, పేద ప్రజల సొంతింటి కలను విస్మరించిందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం రూ.22 వేల 500 కోట్ల రూపాయలను పేద ప్రజల సొంతింటి కల కోసం ఈ సంవత్సరం కేటాయించిందని, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదల సంక్షేమం అజెండాగా పాలన కొనసాగిస్తున్నామని అన్నారు. గుడిసెలో ఉంటున్న నిరుపేదలకు మొదటి విడతలో ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేస్తుందని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం పారదర్శకంగా అమలు చేయాలని, ఎక్కడ లంచాలకు ఆస్కారం లేకుండా ఇండ్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రాజకీయపార్టీలకు అతీతంగా పేద, నిరుపేదలకు మొదటి విడతలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. మొదటి విడతలో ఇండ్లు రాని వారు ఆందోళన చెందవద్దని దశల వారిగా ప్రతి పేద వాడికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే బాధ్యత నాదే అన్నారు. ప్రభుత్వం పెట్టే ప్రతీ రూపాయి కూడా పేదలకు ఉపయోగపడాలని తాము ప్రయత్నిస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.

ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్దిదారులు పలువురు మాట్లాడుతూ గత పదేళ్లుగా సొంతింటి కోసం అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ తమకు ఇళ్లు మంజూరు కాలేదని, సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సహాయంతో తమకు ఇండ్లు మంజూరు కావడం సంతోషంగా ఉందని పలువురు మహిళలు సంతోషం వ్యక్తం చేశారు.

Leave a Reply