Movie | హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు రిలీజ్ వాయిదా – రెండు భాగాలుగా విడుద‌ల‌కు స‌న్నాహాలు

ప‌వ‌ర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తోన్న సరికొత్త చిత్రం ‘హరిహర వీరమల్లు’. జ్యోతికృష్ణ. క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఎ.ఎం.రత్నం నిర్మాత. ఇప్పటికే ఈ సినిమా పలుమార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. జూన్ 12న ఇది విడుదలవుతుందని భావించిన అభిమానులకు మరోసారి నిరాశ ఎదురైంది. హరిహర వీరమల్లు మరోసారి వాయిదా పడినట్లు టీమ్ తాజాగా అధికారికంగా ప్రకటించింది. త్వ‌ర‌లోనే కొత్త తేదిన ప్ర‌క‌టిస్తామ‌ని వెల్ల‌డించింది. ఈ మేర‌కు ప్రెస్ నోట్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. కాగా, రెండు భాగాల్లో దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

“అచంచలమైన ఓపిక, నమ్మకంతో ‘హరిహర వీరమల్లు’ సినిమాకు తోడుగా నిలిచిన అభిమానులు, శ్రేయోభిలాషులు, సినీ ప్రేమికులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. గతంలో ప్రకటించిన విధంగా జూన్ 12వ తేదీకి ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకురావడానికి అవిశ్రాంత ప్రయత్నాలు చేస్తున్నాం. ఎంతో శ్రమించినప్పటికీ వివిధ కారణాల వల్ల ఆ రోజు సినిమాని విడుదల చేయలేకపోతున్నాం. కష్టమైనప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.

పవన్ కల్యాణ్ ఇమేజ్ ను దృష్టిలోఉంచుకుని దీనిని మరింత గొప్పగా తీర్చిదిద్దాలనేది మా ఆలోచన. ప్రతి ఫ్రేమ్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, అద్భుతమైన చిత్రంగా మలిచే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నాం. అందుకే మేము మరికొంత సమయం తీసుకుంటున్నాం. మీ ఎదురుచూపులకు బహుమతిగా గొప్ప చిత్రాన్ని అందిస్తామని హామీ ఇస్తున్నాం” అని టీమ్ ప్రకటించింది.

సోషల్ మీడియా వేదికగా జరిగే ప్రచారాలను ఏమాత్రం నమ్మవద్దని కోరింది. సినిమాకు సంబంధించిన విషయాలను తామే అధికారికంగా ప్రకటిస్తామని చెప్పింది. అంతేకాకుండా త్వరలోనే ట్రైలర్ రిలీజ్ కానుందని.. కొత్త విడుదల తేదీని కూడా ప్రకటిస్తామని టీమ్ వెల్లడించింది. హిస్టారికల్ యాక్షన్ మూవీగా ఈ సినిమా సిద్ధమవుతోంది. నిధి అగర్వాల్ కథానాయిక. మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే కథ ఇది. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు.

Leave a Reply