AP | థియేట‌ర్ ల బంద్ ప్రతిపాదించిన నేత‌పై జ‌న‌సేన వేటు

మంగళగిరి తెలుగు రాష్ట్రాల థియేటర్ల బంద్ పిలుపు వ్యవహారంలో జనసేన కీలక నేత, రాజమండ్రి పార్టీ ఇన్చార్జ్ అను శ్రీ సత్యనారాయణ అలియాస్ అత్తి సత్యనారాయణ మీద జనసేన పార్టీ చర్యలు తీసుకుంది. అవాంఛనీయమైన థియేటర్ల బంద్ పిలుపు నిర్ణయంలో మీరు భాగస్వాములేనని మీపై తీవ్రమైన ఆరోపణలు వచ్చినందున, జనసేన పార్టీలోని మీ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నామని, అలాగే మిమ్మల్ని పార్టీ రాజమండ్రి నగర నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతల నుంచి తొలగిస్తున్నామని పేర్కొన్నారు.

మీపై వచ్చిన ఆరోపణలు సత్యమా అసత్యమా అని మీరు నిరూపించుకునే వరకు మీరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశిస్తున్నట్లు జనసేన కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ హెడ్ వేములపాటి అజయ్ కుమార్ పేరుతో ఒక లెటర్ హెడ్ మీద లేఖ రిలీజ్ చేశారు. దీనిని జనసేన పార్టీ అఫీషియల్ ఎక్స్ హ్యాండిల్ నుంచి షేర్ చేశారు.

అత్తి సత్యనారాయణ తూర్పు గోదావరి జిల్లాలో అనుశ్రీ ఫిల్మ్స్ పేరుతో సినిమాల డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఇక జూన్ 1వ తేదీ నుంచి థియేటర్ల బంద్ చేయాలని మొట్టమొదట పిలుపునిచ్చింది ఆయనేనని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు నిన్న దిల్ రాజు కూడా తన ప్రెస్ మీట్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఆయన జనసేన కీలక నేత అనే విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ సినిమాటోగ్రఫీ మంత్రితో పాటు కీలకమైన అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కూడా ఈ అంశం చర్చకు వచ్చింది. ఒకవేళ థియేటర్ల బంద్ వ్యవహారం వెనక జనసేన నేత ఉన్నా ఏమాత్రం వెనకాడాల్సిన పనిలేదని, చర్యలు తీసుకోవాలని పవన్ తేల్చి చెప్పారు. ఆ కాసేపటికి పార్టీ నుంచి ఆయనను తొలగిస్తున్నట్లు ప్రకటన రావడం గమనార్హం.

Leave a Reply