ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన ముంబై – పంజాబ్ జట్ల మధ్య కీలక పోరు నేడు జరుగుతుంది. టాప్-2 స్థానాలను కైవసం చేసుకోవడం కోసం ఇరు జట్లు తలపడుతుండగా… టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.
ఈ ఇన్నింగ్స్ లో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (20 బంతుల్లో 27), కెప్టెన్ రోహిత్ శర్మ (21 బంతుల్లో 24) పరుగులు చేసి వెను దిరిగారు. సూర్యకుమార్ యాదవ్ తన అర్ధశతకంతో (39 బంతుల్లో 57) ముంబై ఇన్నింగ్స్‌కి మాంచి బలాన్నిచ్చాడు.
అలాగే విల్ జాక్స్ (8 బంతుల్లో 17), హార్దిక్ పాండ్యా (15 బంతుల్లో 26), నమన్ ధీర్ (12 బంతుల్లో 20) కీలక దశలో వేగంగా పరుగులు రాబట్టారు. దీంతో ఎంఐ జట్టు రక్షణాత్మక స్కోర్ నమోదు చేయగలిగింది.
పంజాబ్ బౌలింగ్ విభాగంలో అర్షదీప్ సింగ్, మార్కో జాన్సన్, వైశక్ విజయ్ కుమార్ చెరో రెండు వికెట్లు తీసి ముంబై స్కోరును కట్టడి చేయడంలో సహకరించగా, హర్‌ప్రీత్ బ్రార్ కూడా ఒక వికెట్ దక్కించుకున్నాడు.
ఇప్పుడు పంజాబ్ జట్టు 185 పరుగుల విజయలక్ష్యంతో ఛేజింగ్ ప్రారంభించనుంది. టాప్-2 రేసులో ఇది నిర్ణాయకమైన మ్యాచ్ కావడంతో.. రెండూ జట్లు పూర్తి స్థాయిలో పోటీ ఇవ్వనున్నాయి.