Notice | కాళేశ్వ‌రం విచార‌ణ‌కు కెసిఆర్ కు పిలుపు ..ఈట‌ల‌, హ‌రీశ్ ల‌కు కూడా

హైద‌రాబాద్ – కాళేశ్వరం కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. జూన్ 5న విచారణకు హాజరు కావాలని మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు జారీ చేశారు. అలాగే , మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ ఈటల రాజేందర్‌కు కూడా ఈ నోటిసులు ఇచ్చారు. జూన్ ఆరో తేదిన హారీశ్ రావు, జూన్ తొమ్మిదో తేదిన ఈట‌ల రాజేంద‌ర్ లు హాజ‌రుకావాల‌ని వారికి పంపిన నోటీసులో పేర్కొన్నారు..

కాగా కాళేశ్వరం పై ప్రభుత్వం వేసిన కమిషన్ విచారణకు ప్రభుత్వం గడువు పెంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మాజీ సీఎం, మాజీ మంత్రులకు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఇది ఇలా ఉంటే తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపింది కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణ వ్యవహారం. ఈ ఇష్యూలో నిజాల్ని నిగ్గు తేల్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ అధ్యక్షతన కమిషన్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే విచారణ ప్రారంభించిన కమిషన్ పలువురు అధికారులను సైతం విచారించింది. షెడ్యూల్ ప్రకారం జస్టిస్ ఘోష్ కమిషన్ గడువు ఈ నెలాఖరుతో ముగియాల్సి ఉంది. కానీ కమిషన్ గడువును ప్రభుత్వం మరో రెండు నెలల పాటు పొడిగించింది.

ఇక ఈ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించారని భావిస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విచారించిన తర్వాతే.. ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించాలని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ యోచిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు, గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌లను విచారించకుండానే.. కమిషన్‌కు అందిన పత్రాల ఆధారంగా నివేదిక సమర్పించేందుకు సిద్దం అయ్యింది. అయితే ఒక వ్యక్తిపై అభియోగాలు నమోదు చేసేటప్పుడు, ఆ ఆరోపణలపై సదరు వ్యక్తి వివరణ ఇచ్చుకోవడానికి అవకాశం కల్పించాలి. ఈ మేరకు మాజీ సీఎం కేసీఆర్‌ను విచారణకు ఆహ్వానించి.. వివరణలు తీసుకోవాలని కమిషన్ నిర్ణయించుకుంది. అందులో భాగంగానే కమిషన్ విచారణ గడువును జూలై 31వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే మాజీ ముఖ్య‌మంత్రి కెసిఆర్ కు , ఆయ‌న మంత్రి వ‌ర్గంలో ప‌నిచేసిన హ‌రీశ్ రావు, ఈట‌ల‌కు విచార‌ణ కోసం చంద్ర‌ఘోష్ క‌మిష‌న్ నోటీసులు జారీ చేసింది.

Leave a Reply