New Scheme | మాచారంలో ‘ఇందిర సౌర గిరి జల వికాసం’

మ‌హాబూబ్‌న‌గ‌ర్, ఆంధ్ర‌ప్ర‌భ బ్యూరో : నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండ‌లం మాచారంలో ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అట్ట‌హాసంగా ప్రారంభించారు. ప్రారంభ‌ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనర్సింహ, జూప‌ల్లి కృష్ణారావు త‌దిత‌రులు పాల్గొన్నారు. రూ.12,600 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ ప‌థ‌కాన్ని ప్రారంభిస్తున్న సంగ‌తి విదిత‌మే. తెలంగాణలో అటవీ హక్కుల చట్టం కింద 6.69 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూములకు పోడు పట్టాలు మంజూరైన నేపథ్యంలో బీడు వారుతున్న పోడు భూములకు జల‌కళను తెచ్చేందుకే సర్కార్ ఈ కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టిన సంగ‌తి విదిత‌మే.

రాబోయే ఐదేళ్లలో 2.10 లక్షల ఎకరాల పోడు భూముల్లో సాగుకు వంద శాతం సబ్సిడీతో సోలార్ పంప్‌ సెట్లను అందజేయనున్నారు. ఈ పథకాన్ని అమలు చేయడం ద్వారా గిరిజన రైతులు ఆర్థికంగా బలంగా చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అదేవిధంగా విద్యుత్ సౌకర్యం లేని 6 లక్షల ఎకరాలకు ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకం వర్తించనుంది. గిరిజన రైతుకు 2 ఎకరాల కన్నా ఎక్కువ భూమి ఉంటే సింగిల్‌ యూనిట్, అంతకు తక్కువగా ఉంటే.. సమీప రైతులను కలిపి బోర్‌వెల్‌ యూజర్‌ గ్రూపుగా ఈ ప‌థ‌కం కింద‌ ఏర్పాటు చేయనున్నారు.

సీతారామాంజ‌నేయ ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు


అనంతరం కొండారెడ్డి ప‌ల్లెకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి సీతారామాంజనేయ ఆలయాన్ని దర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా దేవాదాయ‌శాఖ అధికారులు, అర్చ‌కులు సీఎంను పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం ఆంజ‌నేయ స్వామికి సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.

Leave a Reply