నంద్యాల బ్యూరో, మే 18 (ఆంధ్రప్రభ) : నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలోని భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవస్థానం పరిధిలో ఆదివారం ఉదయం 10గంటల ప్రాంతంలో పెద్దపులి ఆ పరిసర ప్రాంతాల్లో సంచరించడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. దేవస్థానం పరిధిలోని బ్రామరి పుష్పవనం వద్ద పెద్దపులి సంచరించిది. ఈ మధ్యకాలంలో శ్రీశైలం, సున్నిపెంట పరిసర ప్రాంతాల్లో తరచుగా పెద్ద పులులు, చిరుత పులులు ఎక్కువగా దేవస్థానం పరిసర ప్రాంతాల్లో తారసపడుతున్నాయి. క్రూర జంతువుల సంచారంతో భక్తులు భయాందోళన చెందుతున్నారు.
పట్టపగలే పుష్పవనం వద్ద పెద్దపులి కనిపించడంతో భక్తులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. గత నెలలో సున్నిపెంటలో ఓ పూజారి ఇంట్లోకి చిరుత పులి వచ్చిన విషయం పాఠకులకు తెలిసిందే. గత 15 రోజుల క్రితం కూడా చిరుతపులులు అటవీ ప్రాంతం నుంచి వెలుపలికి రావడం జరుగుతుంది. అటవీ ప్రాంతంలో నీటి కొరతతోనే ఈ జంతువులు బయటకు వస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పులి సంచారంపై అటవీ శాఖ అధికారులకు దేవస్థానం సిబ్బంది సమాచారమిచ్చారు. అటవీ శాఖ అధికారులు వచ్చి పెద్దపులి సంచరించిన ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు.