హైదరాబాద్ – మిస్ వరల్డ్ పోటీల కోసం హైదరాబాద్ వచ్చిన సుందరీమణులు తెలంగాణ పర్యటనలో భాగంగా నేటి సాయంత్రం పాలమూరుకు వెళ్లనున్నారు. అక్కడ పిల్లలమర్రి ని సందర్శిస్తారు. 22 మంది మిస్ వరల్డ్ పోటీదారులు సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు పిల్లలమర్రి పరిసరాల్లో సందడి చేయనున్నారు. ముందుగా 16వ శతాబ్దం నాటి శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకుంటారు. అనంతరం పురావస్తు మ్యూజియంను సందర్శిస్తారు.
పాఠశాలల విద్యార్థులతో ముఖాముఖి..
తర్వాత పిల్లలమర్రి మహావృక్షం కింద గురుకుల పాఠశాలల విద్యార్థులతో సుందరీమణులు ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఫోటోషూట్ కూడా చేస్తారు. మిస్ వరల్డ్ పోటీదారుల రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శుక్రవారం సాయంత్రం మూడు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నగరంలోని మెట్టుగడ్డ నుంచి పిల్లలమర్రి వరకు ఆంక్షలు విధించారు. 13 వందల మంది పోలీసులతో మూడంచల బందోబస్తు ఏర్పాటు చేశారు. అందాల భామలకు స్వాగతం పలికేందుకు జిల్లా అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు.