Exclusive | అమెరికా అంతే..! కుట్ర, కుతంత్రం దాని మంత్రం

దాయాదుల మధ్య చిచ్చే లక్ష్యం
అప్ప‌ట్లో తిప్పికొట్టిన ఇందిరా గాంధీ
అదరని, బెద‌ర‌ని ప్రధాని మోదీ
పెద్దన్నకు ఎప్పుడూ భంగపాటే

అప్పుడు..ఇప్పుడు..ఎప్పుడూ.. అమెరికాది అదే తంత్రం, కుతంత్రం. దాయాదుల మధ్య చిచ్చు లేకపోతే ఆమెరికాకు మనుగడే లేదు. రెచ్చగొట్టి.. రాజీ మంత్రం పఠించడం ఆ దేశానికి అలవాటే. ఇండియా, పాకిస్థాన్ మధ్య క‌శ్మీర్ ఆజ్యానికి మూలం ఈ అగ్రరాజ్యమే. ఈ రెండు దేశాలు తన్నుకు చస్తే.. అయ్యో గొడవొద్దూ అంటూ శాంతి వచనాలు పలికే అమెరికా దుర్బుద్ధి భారత్ కు తెలుసు. ఈ సారి రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ క్రెడిట్ కార్డును అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బాహాటంగానే కొట్టేసి.. భారత దేశంలో రాజకీయ రగడకు ఆజ్యం పోశారు. కానీ అప్పటి ఇందిరాగాంధీ కావొచ్చు.. ఇప్పటి నరేంద్ర మోదీ కావొచ్చు..పాక్ ఆగడాలను తిప్పి కొట్టటంలో భారత్ సైన్యం తప్పటడుగులు వేయదనేది నిజం.

పాకిస్థాన్ ఆగడాలను తిప్పి కొడుతున్న భారత్ దూకుడుకు కళ్లెం వేసేందుకు అమెరికా కాల్పుల విరమణ కుతంత్రం ఈనాటిది కాదు. భారత్ ఆకాశ్.. బ్రహ్మోస్ ప్రతిదాడితో చతికిల పడిన పాకిస్థాన్ ను కాపాడేందుకు రంగంలోకి దిగిన అమెరికా.. శాంతి కపోతాన్ని ఎగరవేసింది. సహజంగా శాంతికి, ప్రశాంతతకు తలొగ్గే భారత్ ను మరో సారి పావుగా వాడుకునేందుకు పెద్దన పాత్ర పోషించింది. పాకిస్థాన్ చేతిలో ఆయుధాలను ధనుమాడుతూ.. ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని .. కాల్పుల విరమణకు భారత్ సరే అని తలూపింది. కానీ.. ఈ చర్యే యావత్ భారతావనిని కలచి వేసింది. అమెరికా కుయుక్తులపై యువతరం ఆగ్రహం వ్యక్తం చేసింది.

1971 యుద్ధం వేళ కూడా ఇదే తరహాలో అమెరికా వ్యవహరిస్తే.. నాటి ప్రధాని ఇందిరాగాంధీ తిరస్కరించింది. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా అమెరికా ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్నారు. తమ మధ్య గొడవలకు మధ్యవర్తికి పని లేదన్నారు. పాక్ ఆక్రమిత భారత్ తమదే అన్నారు. ఉగ్ర ముష్కరులను అప్పగించాలని గ‌ర్జించారు. కానీ ఈ ప్రకటనే ఒక రోజు ఆలస్యంగా వెలువడటంతోనే.. రాజకీయ వాదోపవాదనలకు ఆస్కారం పెరిగింది. అటు ఇందిరాగాంధీ.. ఇటు నరేంద్ర మోడీ నిర్ణయాలపై దేశవ్యాప్తంగా డిబేట్ సాగుతోంది.

ఆంధ్రప్రభ, సెంట్రల్ డెస్క్
భారత్, పాకిస్తాన్ మధ్య మే 10న సాయంత్రం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. పహల్గాం దాడి తర్వాత, పాకిస్తాన్‌లో భారత సైన్యం ఆపరేషన్ సిందూర్‌తో తన ప్రతాపం ప్రదర్శించింది. ఇక ఉక్రోషంతో పాకిస్తాన్ చీకటి దెబ్బతో ఈ రెండు దేశాల మధ్య ఘర్ష‌ణ అనివార్యంగా మారింది. మధ్యలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తలదూర్చి.. ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశారు. ఇరు దేశాలు కాల్పుల విరమణను ప్రకటించక ముందే.. ఈ నిర్ణయం తన వల్లే కుదిరిందని గొప్పులకు పోయారు. అమెరికా మధ్యవర్తిత్వంతో సుదీర్ఘ చర్చల తర్వాత, భారత్, పాకిస్తాన్ పూర్తిస్థాయిలో తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించాయని ప్రకటించడానికి నేను సంతోషంగా ఉన్నాను” అని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మే 10న సాయంత్రం 5 గంటలకు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ట్రంప్ ఈ పోస్టు చేసిన తర్వాత, భారత్, పాకిస్తాన్ ప్రభుత్వాలు కూడా కాల్పుల విరమణను ప్రకటించాయి. నాలుగు రోజుల్లోనే కాల్పుల విరమణపై భారత్ లోని సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తెరమీదకు వచ్చారు. ఇక కాంగ్రెస్ పార్టీ తన శైలిలో ఇందిరా గాంధీని ప్రశంసించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్‌తో ఇందిరా గాంధీ ఫొటోను అధికారిక ఎక్స్ హ్యాండిల్‌లో కాంగ్రెస్ షేర్ చేసింది. అసలు 54 ఏళ్ల కిందట బంగ్లాదేశ్ కోసం పాకిస్థాన్‌తో యుద్ధం చేస్తున్న భారత్‌ను డీలా పర్చేందుకు అమెరికా పన్నిన రాజీమంత్రాంగం ఫలించలేదు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అమెరికా అధ్యక్షుడి మాటల్ని అసలు ఖాతరు చేయలేదు. ఇదే విషయాన్ని ప్రస్తుతం యావత్ భారతావని గుర్తు చేస్తోంది.

అవమానించినా..
తూర్పు పాకిస్తాన్‌లో ఆగడాలను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లడానికి అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ 1971 నవంబరులో అమెరికా వెళ్లారు. ఆమెను 45 నిమిషాల పాటు అమెరికా అధ్యక్షుడు నిక్సన్ బయటే ఉంచారు. వైట్ హౌస్ దగ్గర స్వాగత ప్రసంగంలో బీహార్ వరద బాధితుల పట్ల నిక్సన్ తన సానుభూతిని వ్యక్తం చేశారు గానీ, తూర్పు పాకిస్తాన్ గురించి ప్రస్తావించలేదు. ఆ సమయంలో భారత్‌కు వచ్చి శిబిరాల్లో ఆకలితో చనిపోతున్న దాదాపు కోటి మంది బెంగాలీ శరణార్థుల గురించి నిక్సన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఉద్దేశపూర్వకంగానే ఇందిరా గాంధీని చులకన చేసినట్లు వ్యవహరించారు. ఇందిరాగాంధీ ఆ విషయాన్ని పట్టించుకోలేదు. నిక్సన్‌కు చెప్పాల్సింది చెప్పారు. ‘‘తూర్పు పాకిస్తాన్‌లో జరుగుతున్న మారణహోమాన్ని ఆపాలి, మా దేశానికి వచ్చిన శరణార్థులు తిరిగి పాకిస్తాన్‌కు వెళ్లాలి. శరణార్ధులకు మా దేశంలో చోటు లేదు’’ అని చెప్పారు. 1967లో నిక్సన్‌ను ఇందిరాగాంధీ ఢిల్లీలో కలిసినప్పుడు ఇరవై నిమిషాలు మాట్లాడారు. అప్పటికే ఇందిర చాలా విసుగు చెందారు. ఇంకెంతసేపు ఆయనతో మాట్లాడాలి? అని అప్పటి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారితో ఇందిరా గాంధీ హిందీలో ప్రశ్నించారు. ఇక 1971 నాటికీ వీరిద్దరి మధ్య పెద్దగా మార్పు రాలేదు.

మాటకు మాట ..
” పాకిస్తాన్ వ్యవహారాల్లో ఇండియా తల దూర్చితే అమెరికా నోరుమూసుకుని కూర్చోదు. ఇండియాకు తగిన గుణపాఠం చెప్పుతాం” – అమెరికా అధ్యక్షుడు. రిచర్డ్ నిక్సన్ బెదిరింపు

” అమెరికాను స్నేహితుడిగా ఇండియా పరిగణిస్తోంది. యజమానిగా కాదు, తన భవితవ్యాన్ని లిఖించుకోగల శక్తి ఇండియాకు ఉంది. పరిస్థితులను బట్టి ఎవరితో ఎలా వ్యవరించాలో మాకు తెలుసు”

  • భారత ప్రధాని ఇందిరాగాంధీ

అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్​లో ఈ ఇరువురు నేతల మధ్య జరిగిన ముఖాముఖి సంభాషణల్లో ఇది చిన్న భాగం. ఇండో అమెరికా దేశాధినేతల సంయుక్త పత్రికా సమావేశాన్ని ఏకపక్షంగా రద్దు చేసి, ఇందిరాగాంధీ తన శైలిలో ఠీవిగా వైట్​హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. ఆమెకు వీడ్కోలు చెప్పేందుకు కారు వరకు వచ్చిన అప్పటి అమెరికా విదేశాంగ కార్యదర్శి, జాతీయ భద్రతా సలహాదారు హెన్రి కిసింజర్ ఇందిరా గాంధీ కారు ఎక్కుతుండగా ” మేడం ప్రైమ్ మినిస్టర్.. అధ్యక్షునితో మీరు కొంత సహనంగా వ్యవహరించి ఉండాల్సిందని అనుకోవటం లేదా” అని అడిగినప్పుడు… ” మీ సలహాకు ధన్యవాదాలు. ఒక అభివృద్ధి చెందుతున్న దేశంగా అకృత్యాలపై పోరాడేందుకు తగినంత దృఢంగా, నిటారుగా మా వెన్నెముక ఉంది. వేల మైళ్ళ దూరం నుంచి ఏ దేశాన్నైనా శాసించే రోజులు గతించాయని మేము రుజువు చేస్తాం” అని ఇందిరాగాంధీ దీటుగా సమాధానం ఇచ్చారు.

ప్రతిపక్షంతో సంపూర్ణ మద్దతు
అరేబియా సముద్రంలో అమెరికా యుద్ధ నౌకను తరిమేసిన తరువాత ఎయిర్ ఇండియా బోయింగ్ విమానంలో ఇందిరాగాంధీ పాలం విమానాశ్రయం (ఇప్పుడు ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి) చేరుకోగానే నాటి ప్రతిపక్షనేత అటల్ బిహారీ వాజపేయిని తక్షణం తన నివాసానికి పిలిపించుకున్నారు. ఒక గంట పాటు వీరిద్దరి మధ్య ఆంతరంగిక చర్చలు జరిగాయి. అనంతరం వాజపేయి హడావిడిగా బయటికి వెళ్లిపోయారు. ఐక్యరాజ్యసమితిలో వాజపేయి భారత్​కు ప్రాతినిధ్యం వహించనున్నారని, ఆ విషయం గురించి మాట్లాడేందుకే ఇందిర ఆయనను పిలిపించారని ఆ తర్వాత తెలిసింది. ఇందిరా గాంధీ మిమ్మల్ని బలమైన ప్రత్యర్థిగా భావిస్తారు కదా.. అయినప్పటికీ ఈ ప్రభుత్వ విధానాన్ని సమర్థిస్తూ ఐక్యరాజ్యసమితిలో మీరు గొంతు చించుకోగలరా అని ఓ జర్నలిస్టు వాజ్ పేయిని ప్రశ్నించారు. “ఒక తోటలో గులాబీ ఉంటుంది, లిల్లీ కూడా ఉంటుంది. రెండూ తమకు తామే అందమైనవని అనుకుంటాయి. ఐతే తోట సంక్షోభంలో పడినప్పుడు మొత్తం తోట అందాన్ని కాపాడుకోవటానికి రెండూ ఏకం అవుతాయి. మా తోటను కాపాడుకోవటానికే ఈ రోజు నేనిక్కడికి వచ్చాను. ఇదే భారత ప్రజాస్వామ్యం” అని వాజ్​పేయి దీటుగా బదులిచ్చారు. భారత్ – పాక్​ల 18 రోజుల యుద్ధంలో 1.5 లక్షలమంది పాకిస్తానీ సైనికులను యుద్ధ ఖైదీలుగా పట్టుకోవటంతో యుద్ధం ముగిసింది. లాహోర్ జైలు నుంచి బంగ్లాదేశ్ స్వాతంత్య్ర యోధుడు ముజిబుర్ రెహ్మాన్ విడుదలయ్యారు. మార్చి నెలలో బంగ్లాదేశ్​ను స్వతంత్ర దేశంగా గుర్తిస్తూ ఇందిరాగాంధీ పార్లమెంట్​లో ప్రకటించారు. వాజ్​పేయి ఇందిరాగాంధీని దుర్గామాత అని సంబోధించారు.

అమెరికాకు తప్పని భంగపాటు
ఆ తరువాత అమెరికా పాకిస్థాన్​కు 270 “పాటన్ యుద్ధ ట్యంక్” లను పంపింది. ప్రపంచ మీడియా ప్రతినిధులను పిలిచి అవి ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసినవని, అందువల్ల వాటిని ధ్వంసం చేయటం సాధ్యం కాదని” ప్రకటించుకుంది. ఇండియాకు మరే దేశమూ సహాయం చేయకూడదని ప్రపంచ దేశాలకు అదొక హెచ్చరిక. అక్కడితో అమెరికా ఆగిపోలేదు. భారత దేశానికి చమురు సరఫరా చేసే ఏకైక అమెరికా కంపెనీ ‘బర్మా షెల్ కంపెనీ’ని సరఫరా నిలిపివేయమంది. భవిష్యత్​లో కూడా భారత్​తో వ్యాపారం చేయరాదని శాసించింది. వీటన్నింటికీ ఏ మాత్రం అదరని, బెదరని ఇందిరాగాంధీ అద్భుత దౌత్యనీతి వల్ల ఉక్రెయిన్ నుంచి భారత్​కు చమురు సరఫరా జరిగింది. ఒక్క రోజు యుద్ధంలోనే అమెరికా ఎంతో గొప్పగా చెప్పుకున్న 270 యుద్ధ ట్యాంకులు భారత సైన్యం చేతుల్లో ధ్వంసమయ్యాయి.! వాటిని అనంతరం ఇండియాకు తెచ్చి ప్రదర్శించారు. అవి అమెరికా ప్రతిష్ట భంగ పాటుకు నేటికీ సాక్షీభూతంగా నిలుస్తున్నాయి!

తాజాగా వాడీవేడి చర్చ
1971ని, 2025తో పోల్చడం సరికాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 1971లో పాకిస్తాన్‌తో యుద్ధం తర్వాత బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు సోవియట్ యూనియన్ ఉంది. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైంది. సోవియట్ యూనియన్‌కు ఉన్నంత శక్తి రష్యాకు ఎప్పుడూ లేదు. ఇది భారత్‌కెప్పుడూ లోపమేనని అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు. అప్పుడు సోవియట్ యూనియన్ మద్దతు భారత్‌కు ఉంది, పాకిస్తాన్‌కు అప్పుడు అణ్వాయుధ సామర్థ్యం లేదు.”అప్పుడు అమెరికా నుంచి బెదిరింపులున్నాయి. క్షేత్రస్థాయి పరిస్థితులు కష్టంగా ఉన్నాయి. కానీ ఇందిరా గాంధీ భయపడలేదు. పాకిస్తాన్ సైన్యం లొంగిపోవడంతో 1971 యుద్ధం ముగిసింది. సిమ్లా ఒప్పందంలో రష్యా, అమెరికా రెండింటి ఒత్తిడితో భారతదేశానికి ఎలాంటి ప్రయోజనం కలగలేదు. 99 వేల మంది యుద్ధ ఖైదీలను విడుదల చేసింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌ను ఖాళీ చేయడానికి ఎలాంటి షరతు విధించలేదు. సరిహద్దును అధికారికంగా నిర్ణయించలేదు. యుద్ధానికి లేదా శరణార్థుల సమస్య కోసం భారతదేశానికి ఎలాంటి పరిహారం సంపాదించలేదు. ఆ సమయంలో ఇందిరా గాంధీ ప్రధానమంత్రి. మీకు అనుకూలమైన విషయాలు చెప్పడం మానేయండి” అని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియ పోస్ట్ చేశారు.

ఈ సంఘటనలు భారతదేశానికి పలు దీర్ఘకాలిక ప్రయోజనాలు కల్పించాయి!
ఇండియా తన స్వంత చమురు సంస్థ “ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్” ను ఏర్పాటు చేసుకుంది!. అలీన దేశాల కూటమిని ముందుండి నడిపింది. శక్తివంతమైన ఆ కాలం , ఆనాటి సంఘటనలు కాలగర్భంలో కలిసిపోయాయి, ప్రస్తుత తరానికి తెలియకుండా పోయాయి. కాని.. నిజమైన చరిత్ర ఎప్పటికీ మార్గదర్శిగా ఉంటుంది. నాటి నుండి ఇండియా ఇప్పటికి 50 సంవత్సరాలు గడిపేసింది, ప్రస్తుతం దేశంలో, నేతల్లో ఒక విధమైన అలసత్వ స్వభావం గోచరిస్తోంది, తన బలమేమిటో గుర్తించే లక్షణాన్ని కోల్పోయినట్లుగా అనిపిస్తోంది!

Leave a Reply