America ట్రంప్ నిబంధనలు – పెరెంట్స్లో టెన్షన్.. టెన్షన్!
అమెరికాలో కొనసాగుతున్న
కఠినతరం చేసిన ఇమ్రిగేషన్ అధికారులు
పార్ట్ టైమ్ ఉద్యోగాలకు ప్రవాస భారతీయ విద్యార్థుల స్వస్తి
నెలకు రూ.1,70,000 ఆదాయం కోల్పోతున్న భారతీయులు
ఫీజులు, ఖర్చులకు పంపుతున్న తల్లిదండ్రులు
నెలకు రూ.80,000 పంపించడం పెను భారం
అమెరికాలోని వ్యాపార సంస్థల్లో సిబ్బంది కొరత
సెంట్రల్ డెస్క్, హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టాక.. అక్కడ చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా భారతీయ విద్యార్థులు ఆర్థిక సమస్యలతో విలవిల్లాడిపోతున్నారు. తమ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అని అమెరికాలోని విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు టెన్షన్ పడుతున్నారు. ఒకవైపు రూపాయి మారకం విలువ కంటే అమెరికా డాలర్ విలువ పెరిగిపోతోంది. మరోవైపు క్యాంపస్ బయట పార్ట్-టైమ్ ఉద్యోగాలు చేయడానికి వీల్లేదని ట్రంప్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇమ్మిగ్రేషన్ అధికారులు అక్రమ వలసదారులను గుర్తించేందుకు సోదాలు చేస్తున్నారు. దీంతో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ప్రస్తుతానికి పార్ట్-టైమ్ ఉద్యోగాలు మానేశారు. దీంతో ఫీజులు కట్టడానికి డబ్బులు లేకపోవడం, అక్కడి విద్యార్థులు పూర్తిగా తల్లిదండ్రులపై ఆధారపడుతున్నారు. ఫలితంగా విద్యార్థులు తల్లిదండ్రులు ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నారు.
అమెరికాలో పార్ట్ టైమ్ జాబ్‌ల నిబంధనలు ఇలా…
ఎఫ్-1 వీసాతో అమెరికాలో చదువుకునే విద్యార్థులు వారానికి 20 గంటల వరకు క్యాంపస్ లోపల మాత్రమే పార్ట్-టైమ్ ఉద్యోగాలు చేసుకోవచ్చు. వేసవి సెలవులు లేదా సెమిస్టర్ విరామ సమయంలో వారానికి 40 గంటలు పని చేయవచ్చు. కానీ క్యాంపస్ బయట పార్ట్-టైమ్ ఉద్యోగాలు చేయడానికి అనుమతి లేదు. అయితే, క్యాంపస్ లోపల ఉద్యోగాలు అందరికీ దొరకవు. అలాగే క్యాంపస్‌లో జీతాలు తక్కువగా ఉంటాయి. ఈ కారణంగా చాలా మంది విద్యార్థులు క్యాంపస్ బయట పార్ట్-టైమ్ ఉద్యోగాలు చేయాల్సి ఉంటుంది. క్యాంపస్‌లో వారానికి 20 గంటలు పనిచేస్తే భారతీయులు నెలకు వెయ్యి డాలర్లు సంపాదిస్తారు. అదే అమెరికన్లకు అయితే మూడు వేల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అందుకే విదేశీ విద్యార్థులకు మాత్రమే పార్ట్ టైమ్ జాబ్‌లు దొరుకుతుంటాయి. ఈ ఆదాయంతో విద్యార్థులు తమ జీవన వ్యయం, ఫీజులను భరిస్తూ, తల్లిదండ్రులపై ఆర్థిక భారం లేకుండా చూసుకుంటారు. ప్రస్తుతం పరిస్థితులు ఇందుకు భిన్నంగా మారిపోయాయి.
పార్ట్ టైమ్ జాబ్ పోవడంతో…
ఇప్పటికే చాలా మంది విద్యార్థులు తమ విద్యా కోర్సులు పూర్తయిన తర్వాత ఉద్యోగ వేటలో ఉంటూ పార్ట్ టైమ్ జాబ్ చేసుకుని అమెరికాలో జీవనం సాగిస్తున్నారు. వారానికి 40 గంటలు పనిచేస్తే సుమారు రెండు వేల డాలర్ల ఆదాయం వస్తుంది. ఇండియన్ కరెన్స్ ప్రకారం నెలకు సుమారు 1,70,000/- ఆదాయం వస్తుంది. అక్కడ అన్ని ఖర్చులు పోనూ రూ.80, 000 మిగులుతుంది. ప్రస్తుతం ఇమిగ్రేషన్ అధికారుల దాడులతో పార్ట్ టైమ్ ఉద్యోగాలు మానేసిన వారు ఈ ఆదాయం కోల్పోయారు. దీంతో వారి తల్లిదండ్రులు నెలకు రూ.80,000లు ఇండియా నుంచి పంపించాల్సి ఉంటుంది. దీంతో ఇక్కడ నుంచి తల్లిదండ్రులు రూ.80000 లు పంపించడంపెను భారంగా మారింది.
ఇమిగ్రేషన్ అధికారుల కఠిన చర్యలు
అమెరికాలో ఇమ్మిగ్రేషన్ అధికారులు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. క్యాంపస్ బయట పార్ట్-టైమ్ ఉద్యోగాలు చేసే విద్యార్థులపై కఠినంగా చర్యలు తీసుకుంటున్నారు. వీరిని పట్టుకుంటే, వీసా రద్దు చేసి స్వదేశానికి పంపిస్తారని ప్రకటించారు. ఇలాంటి పరిస్థితి ఎదురైతే, భవిష్యత్తులో అమెరికాకు వెళ్లడం కష్టమవుతుందని భయపడుతున్న విద్యార్థులు పార్ట్-టైమ్ ఉద్యోగాలు మానేస్తున్నారు. కొన్ని నెలల తర్వాత పరిస్థితి మెరుగుపడుతుందని ఆశిస్తున్నారు. అప్పటివరకు, నెలవారీ రూమ్ అద్దె, భోజనం, ఇతర ఖర్చులకు భారతదేశంలోని తల్లిదండ్రుల నుంచి డబ్బు అడుగుతున్నారు.
అమెరికాలో పార్ట్ టైమ్ జాబ్ మీద జీవనం సాగిస్తున్న భారతీయలు
అమెరికా ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ‘ఓపెన్ డోర్’ నివేదిక ప్రకారం, 2023-24లో అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతీయులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. అమెరికాలో 11.26 లక్షల మంది విదేశీ విద్యార్థులు ఉండగా, అందులో భారతీయ విద్యార్థులు 3.30 లక్షల మంది ఉన్నారు. అంటే, ప్రతి 100 మంది అంతర్జాతీయ విద్యార్థుల్లో దాదాపు 30 మంది భారతీయులు. వీరిలో తెలుగు రాష్ట్రాల వారు 56% మంది ఉన్నారు. వీరాంత పార్ట్ టైమ్ జాబ్ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న వారే.
ఏప్రిల్‌లో సర్దుకుంటుంది…
అమెరికా నిబంధనలతో అక్కడి వ్యాపార సంస్థల్లో సిబ్బంది కొరత ఏర్పడింది. వరల్డ్ వైడ్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ నిపుణుల అభిప్రాయం ప్రకారం… ఒక హోటల్లో 10 మంది సిబ్బంది ఉంటే, అందులో ఏడు-ఎనిమిది మంది భారతీయ విద్యార్థులు పార్ట్-టైమ్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడు వారందరూ ఉద్యోగాలు మానేస్తే, వ్యాపారాలు దెబ్బతింటాయి. ఈ పరిస్థితిలో ఏప్రిల్ వరకు మాత్రమే పార్ట్-టైమ్ ఉద్యోగాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించవచ్చు అనే అభిప్రాయాలు ఉన్నాయి. ఆ తర్వాత పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. అంతవరకు ఏమి జరుగుతుందో చూద్దాం.