హైదరాబాద్ – అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే ను పురస్కరించుకుని బీఆర్ఎస్ అధినేత , మాజీ ముఖ్యమంత్రి కల్లకుంట్ల చంద్రశేఖరరావు శ్రామిక, కర్షక, కార్మికలోకానికి మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఉత్పత్తిలో భాగమై జాతి సంపదను సృష్టిస్తున్న సబ్బండ కులాల శ్రామికుల, పరిశ్రమలు తదితర రంగాల్లో పనిచేసే కార్మికుల రెక్కల కష్టానికి వెలకట్టలేమని, వారి త్యాగం అసామాన్యమైనదని కేసీఆర్ తెలిపారు.
చారిత్రాత్మక మేడే ఆవిర్భావ నేపథ్యాన్ని ఈ సందర్భంగా స్మరించుకుని వారి త్యాగాలకు కేసీఆర ఘన నివాళులర్పించారు. మేడే స్పూర్తితో, రాష్ట్రంలోని శ్రామికుల హక్కులను కాపాడుతూ నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు వారి జీవన భద్రతకు భరోసాను పెంచాయన్నారు. పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలబెట్టామన్నారు. రాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానాలను అమలు చేసి ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించామని తెలిపారు. లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించామని కేసీఆర్ అన్నారు.