స్వీడన్ : స్వీడన్ లో కాల్పులు కలకలం రేపాయి. ఉప్సల నగరంలో జరిగిన ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించారు. పలువురికి గాయాలయ్యాయి. వాల్పుర్గిస్ స్ప్రింగ్ ఫెస్టివల్ నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ఉత్సాహంగా ఉన్న సమయంలో కాల్పులు జరిగాయి. దీంతో ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు పెట్టాల్సి వచ్చింది. సమాచారం అందుకున్న అత్యవసర విభాగాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
పోలీసులు నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని నిందితులను గుర్తించే ప్రయత్నం చేశారు. నిందితుడు కాల్పులు జరిపిన తర్వాత ద్విచక్రవాహనంపై పారిపోవడాన్ని తాము చూసినట్లు ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు తెలిపారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టి నిందితుడిని పట్టుకునేందుకు భారీ ఎత్తున జల్లెడ పడుతున్నారు. ఈ మధ్య స్వీడన్ లో రౌడీ మూకల ఆగడాలు విపరీతంగా పెరిగిపోయాయి. గత ఫిబ్రవరిలో స్వీడన్ లో ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ఓ సాయుధుడు ఎడ్యుకేషన్ సెంటర్ లో చొరబడి కాల్పులకు తెగబడ్డాడు. దీంతో 10 విద్యార్థులు టీచర్ మరణించారు.