విజయవాడ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి హౌస్ అరెస్ట్ అయ్యారు. ఉద్దండరాయుని పాలెంలో ఈరోజు (బుధవారం) షర్మిల పర్యటించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఏపీసీసీ చీఫ్ నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. 2015లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్దండరాయుని పాలెంలో శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో ఈ ప్రాంతంలో పర్యటించాలని షర్మిల నిర్ణయించగా.. అందుకు పోలీసులు ఆంక్షలు విధించారు.
ఉద్దండరాయునిపాలెంలో పర్యటనకు అనుమతి లేదంటూ షర్మిల ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. ఆ ప్రాంతానికి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. షర్మిల ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఆమె నివాసం వద్ద పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. అయితే పోలీసుల తీరుపై ఏపీసీసీ చీఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైన ఉద్దండరాయుని పాలెం వెళ్లి తీరుతానని షర్మిల స్పష్టం చేశారు. ఈ క్రమంలో షర్మిల నివాసం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
హౌస్ అరెస్ట్ ఎందుకు చేశారు ….
‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు… విజయవాడలోని నా విల్లాలో నన్ను ఎందుకు గృహ నిర్బంధంలో ఉంచారు? ఏ కారణం చేత అనేది… దయచేసి ఏపీ ప్రజలకు సమాధానం చెప్పండి. నేను ఎక్కడకైనా వెళ్లే హక్కు నాకు ఉంది. ఏపీసీసీ అధ్యక్షురాలిగా పీసీసీ కార్యాలయానికి వెళ్లడం నేరమా. మీరు మా రాజ్యాంగ హక్కులను ఎందుకు కాలరాయడానికి ప్రయత్నిస్తున్నారు? మీ ప్రభుత్వం దేనికి భయపడుతోంది?’ అంటూ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షర్మిల ప్రశ్నలు సంధించారు.