కృష్ణలంక, (ఆంధ్ర ప్రభ): మైనర్ బాలికపట్ల అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడికి న్యాయస్థానం మూడు సంవత్సరాల జైలు శిక్షణ విధించింది. 2019 జూన్ 5న, కృష్ణలంకపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న మైనర్ బాలిక పాఠశాలకు నడుచుకుంటూ వెళుతుండగా, ఒక వ్యక్తి ఆ బాలికతో, ఆమె స్నేహితులతో అసభ్యంగా ప్రవర్తించాడు.
ఆ బాలిక భయంతో పారిపోయి జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. ఆ తర్వాత వారు కృష్ణ లంక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు గ్రామానికి చెందిన నిందితుడు పాటల డేవిడ్ పవన్ కుమార్‌ను అప్పటి కృష్ణ లంక ఎస్.ఐ. బి.సత్యనారాయణ అదుపులోకి తీసుకుని, అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.
నిందితుడుపై నేరం రుజువు కావడంతో.. విజయవాడ పోక్స్ కోర్టు న్యాయమూర్తి వి.భవాని తీర్పును ప్రకటించారు. నిందితుడికి ఇరవై వేల రూపాయల జరిమానాతో పాటు మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించారు.