Condemned | వారికి శిక్ష ప‌డాల్సిందే – ఉగ్ర దాడిని ఖండించిన‌ అగ్రదేశాధి నేతలు

ట్రంప్, పుతిన్‌ సహా పలువురి స్పందన
భార‌త్‌కు అండ‌గా నిలుస్తామ‌న్న ట్రంప్‌
సానుభూతి తెలిపిన ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్

ప‌హ‌ల్గామ్ ఘటన క‌ల‌వ‌ర‌పెట్టింద‌ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్స్ వేదికగా స్పందించారు. క‌శ్మీర్ నుంచి వస్తున్న వార్తలు తీవ్ర కలతపెట్టేవిగా ఉన్నాయన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశంతో అమెరికా బలంగా నిలుస్తుందని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ప్రధాని మోదీకి, భారత్‌కు పూర్తి మద్దతు, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇక‌.. ఈ దాడిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఖండించారు. భారత్‌కు అండగా నిలిచారు. ఈ ఘటనకు కారణమైన వారికి శిక్ష పడాల్సిందే అన్నారు.

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో సాయుధ మూక పాల్పడిన అనాగరిక చర్యను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి . ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ దీనిని హేయమైన చర్యగా అభివర్ణించారు. అమాయకులైన పౌరులపై దాడులు ఆమోదయోగ్యం కాదన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు.

ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ దంపతులు ఈ ఘటనపై స్పందిస్తూ. పహల్గామ్‌లో జరిగిన విధ్వంసకర ఉగ్రవాద దాడి బాధితులకు సంతాపం తెలియజేశారు.

జమ్మూకశ్మీర్‌లో పర్యటకులపై దాడి వార్త దిగ్భ్రాంతి కలిగించింది. ఇది అమానవీయ చర్య. బాధితులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. అన్నిరకాల ఉగ్రవాదాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. – చైనా రాయబారి జు ఫీహాంగ్

భారత ప్రభుత్వానికి, ప్రజలకు, బాధితుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేస్తున్నాం. గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాం. ఉగ్రవాదంపై పోరాటంలో శ్రీలంక.. భారత్‌కు ఎప్పుడూ తోడుగా ఉంటుంది – శ్రీలంక విదేశాంగ మంత్రిత్వ శాఖ

పహల్గాంలో జరిగిన అనాగరిక ఉగ్రవాద దాడి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం. ఉగ్రవాదంపై పోరాటంలో ఇజ్రాయెల్ భారత్‌తో కలిసి పనిచేస్తుంది – ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహూ

పహల్గాం ఘటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇటువంటి అమానవీయ చర్యలు బాధాకరం. బాధిత కుటుంబాలకు, భారత్‌కు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం – ఇటలీ ప్రధాని జార్జియా మెలోని
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడిని ఖండిస్తున్నాం. ఇందులో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఈయూ ఎప్పటికీ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటుంది. – ఈయూ విదేశాంగ వ్యవహారాల ప్రతినిధి కాజా కల్లాస్

జమ్మూలో జరిగిన క్రూరమైన దాడిని వ్యతిరేకిస్తున్నాం. అమాయక ప్రజల మరణం తీవ్రంగా కలిచివేసింది. ఈ కష్ట సమయంలో జర్మనీ భారత్‌ వెంట ఉంటుంది. బాధితుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. – జర్మనీ విదేశాంగ కార్యాలయం

ఈ నేరపూరిత చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా భద్రత, స్థిరత్వాన్ని దెబ్బతీసే లక్ష్యంతో జరిగే అన్నిరకాల ఉగ్రవాద చర్యలను ఖండిస్తున్నాం – యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *