బాపట్ల జిల్లా పెనుమూడిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కృష్ణానదిలో మునిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. నదిలో కొట్టుకుపోతున్న మరో ముగ్గురిని స్థానికులు కాపాడారు. పోలీసుల కథనం ప్రకారం.. భట్టిప్రోలు మండలం వేమవరానికి చెందిన 30 మంది నిన్న మధ్యాహ్నం 3 గంటలకు మతమార్పిడి కోసం పెనుమూడిలోని కృష్ణానది వద్దకు వచ్చారు. నదిలో దిగి బాప్టిజం తీసుకుంటున్న సమయంలో పెనుమాల దేవదాసు, తలకాయల గౌతమ్, పెనుమాల సుధీర్‌బాబు, పెనుమాల హర్షవర్థన్, పెనుమాల రాజా నీటిలో మునిగిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే నదిలో దూకి ముగ్గురిని కాపాడారు. పెనుమాల దేవదాసు (19), తలకాయల గౌతమ్(18) గల్లంతయ్యారు. దీంతో వారి కోసం గాలింపు చేపట్టగా కాసేపటి తర్వాత వారి మృతదేహాలు లభించాయి.
ప్రాణాలతో బయటపడిన సుధీర్‌బాబు, హర్షవర్ధన్, రాజా రేపల్లెలోని సురక్ష ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన గౌతం ఇంటర్ పూర్తిచేసి ఎంసెట్ కోచింగ్ తీసుకుంటుండగా, దేవదాసు పాలిటెక్నిక్ పూర్తి చేసి హైదరాబాద్‌లో శిక్షణ పొందుతున్నాడు. ఇంట్లో చెప్పకుండానే వీరు బాప్టిజం తీసుకునేందుకు వెళ్లినట్టు తెలిసింది. యువకుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.