Fine Rice Scheme | ఇది చ‌రిత్ర‌లో నిలిచే ప‌థ‌కం – మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి

నల్లగొండ, ఆంధ్రప్రభ ప్రతినిధి : సన్న బియ్యం పథకం నిరుపేదల ఆత్మగౌరవ పథకమని, చరిత్రలో నిలిచిపోయే పథకామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన నల్గొండ జిల్లా కనగల్ మండలం జి .ఎడవల్లి గ్రామంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామంలో నాలుగు కోట్ల 63 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పేదలు సైతం పెద్దల మాదిరిగానే సన్న బియ్యం తినాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని తీసుకువచ్చిందని తెలిపారు.

ప‌దేళ్ల‌లో ఒక్క రేష‌న్‌కార్డు ఇవ్వ‌లేదు
గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, తమ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు 20 లక్షల మందిని పేర్లు చేర్పించింద‌న్నారు. రూ. మూడు కోట్ల పది లక్షల మందికి సన్నబియ్యాన్ని ఇవ్వనున్నామని తెలిపారు. రూ. 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు ఇవ్వనున్నామని చెప్పారు. కనగల్ మండలంలో 20 ఏళ్ల‌ కింద ఒక్కొక్కటి లక్ష రూపాయలతో తాను 500 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని ,ఇప్పుడు మళ్లీ ఐదు లక్షలతో ఇల్లు కట్టిస్తామని చెప్పారు. ఉచిత బస్సు, రైతు బీమా, రైతు భరోసా, ఎల్పిజి కనెక్షన్ లను తమ ప్రభుత్వం ఇవ్వడం జరిగిందన్నారు. ఉచిత బస్సు సౌకర్యం కోసం ఇప్పటివరకు 4000 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.

ద‌క్షిణ తెలంగాణ‌ను ఎండ‌బెట్టింది…
గత ప్రభుత్వం దక్షిణ తెలంగాణను ఎండబెట్టి ఆంధ్రకు నీళ్లు తీసుకెళ్లిందని, ఎస్ఎల్‌బీసీని పట్టించుకోలేదని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 4518 కోట్లు బడ్జెట్లో కేటాయించామని మంత్రి కోమ‌టిరెడ్డి అన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ మిషన్ చెడిపోతే అమెరికా నుండి తెప్పించి బాగు చేయించి పనులు మొదలుపెట్టినప్పటికీ దురదృష్టవశాత్తు అటు వైపు నుండి టన్నెల్ కూలిపోవడం వల్ల పనులు ఆగిపోయాయని అన్నారు. సంవత్సరంలోగా టన్నెల్ పూర్తి చేస్తామని తెలిపారు. కనగల్ మండలంలో 80 కోట్ల రూపాయలతో రోడ్ల పనులు చేపట్టడం జరిగిందన్నారు. జి ఎడవెళ్లి చెరువు అలుగు గండి మరమ్మతుకు కోటి 30 లక్షల రూపాయలను మంజూరు చేశామ‌ని, వారం రోజుల్లో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ గౌడ్, అనూప్ రెడ్డి , నల్గొండ ఆర్డీవోవై. అశోక్ రెడ్డి, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, మార్కెటింగ్ ఎడి ఛాయాదేవి, డిసిఓ పత్యా నాయక్,, పంచాయతీరాజ్ ఈ ఈ గిరిధర్, తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply