చలో తర్లువాడ..

చలో తర్లువాడ..

గూగుల్ డేటా సెంటర్ భూ బాధితుల సమస్యలు పరిష్కరించకపోతే ప్రతిఘటన
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు
గూగుల్ కు దేవస్థానం భూమి కేటాయించినపుడు లేని సమస్య పంచగ్రామాలకు ఎందుకని ప్రశ్న

పాయకాపురం, ఆంధ్ర ప్రభ : గూగుల్ డేటా సెంటర్లో భూములు కోల్పోయిన దళితులు, రైతుల సమస్యలు ఈ నెల 25లోగా పరిష్కరించకపోతే చలో తర్లువాడ కార్యక్రమం చేపడతామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు అన్నారు. ఏప్రిల్ 28న చేపట్టే గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనను ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. విశాఖ నగరం, పిఠాపురం కాలనీలోని ఏచూరి భవన్ (సిపిఎం జిల్లా కార్యాలయం)లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 520 మంది రైతులకు పరిహారం చెల్లించకుండా, తర్లువాడ, అడవివరం, రాంబిల్లి మండలంలో బలవంతంగా 601 ఎకరాల భూములు తీసుకొని గూగుల్ కు కేటాయించడం అన్యాయమన్నారు.

గూగుల్ బ్రాండ్ పేరుతో 601 ఎకరాలను అదానీ కంపెనీకి ప్రభుత్వం రిజస్ట్రేషన్ చేయనుందని తెలిపారు. పర్యావరణ ప్రభావ అంచనా నివేదిక తయారుచేయకుండా, సామాజిక అధ్యయనం నిర్వహించకుండా, విశాఖ ప్రజలకు తాగునీటి సరఫరాపై స్పష్టత ఇవ్వకుండా గూగుల్ డేటా సెంటర్ కు శంకుస్థాపన ఎలా చేస్తారని ప్రశ్నించారు. గూగుల్ డేటా సెంటర్ పై ప్రజల మదిలో మెదులుతున్న సందేహాలకు సమాధానం చెప్పకుండా ఉద్యోగాలొస్తాయని ఆశచూపి, భ్రమలు పెట్టడం న్యాయం కాదన్నారు.

డేటా సెంటర్ లో ఐదారువేల కంటే ఎక్కువ ఉద్యోగాలు రావని కేంద్రమంత్రులు చెబుతుంటే, లక్ష 50వేల ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం చెప్పడం మోసం కాదా? అని శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఈ పరిమితి ఉద్యోగాల్లో ఎంతమంది స్థానికులకు ఉద్యోగాలు వస్తాయి? ఉత్తరాంధ్ర ప్రజలకు వచ్చిన ప్రయోజనమేమిటో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గూగుల్ కు కేటాయించిన భూమిపై సేల్ డీడ్ ద్వారా అదానికి పూర్తి యాజమాన్య హక్కు కల్పించడానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రూ. 1.2 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టగలిగిన అతి పెద్ద గూగుల్ సంస్థకు కరెంట్, రోడ్లు, నీరు, ట్యాక్స్ ఫ్రీ వంటి సదుపాయాలు, 22వేల కోట్లు రాయితీ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు.

తర్లువాడలో ఎవరూ ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకోవడంతో, గూగుల్ రావడం ఇష్టంలేక పబ్బం గడుపుకోవడానికి ప్రభుత్వం ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్లు భావించాల్సివస్తోందన్నారు. చిత్తశుద్ధి వుంటే ప్రజల అభివృద్ధి, భద్రతకు ప్రాధాన్యత ఇచ్చి బాధితుల సమస్యలు పరిష్కరించి, జవాబుదారీతనంగా ప్రభుత్వం వ్యవహరించేది అన్నారు. తన సొంత నియోజకవర్గంలో భూములు కోల్పోయిన రైతులు, దళితులకు పరిహారం ఇప్పించకుండా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కార్పొరేట్ సేవలో తరిస్తున్నట్లుందని వ్యాఖ్యానించారు. డేటా సెంటర్ తో ఉష్ణోగ్రత ఒక డిగ్రీ పెరుగుతుందని, విశాఖలో ఢిల్లీ కంటే వేడి ఎక్కువగా వుంటుందని పర్యావరణ నిపుణులు చెబుతున్న విషయం గుర్తుచేశారు. కార్పొరేట్ల కోసం విశాఖ ప్రజల ప్రాణాలను ప్రభుత్వం ఫణంగా పెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

గూగుల్ కు లేని సమస్య పంచగ్రామాలకు ఎందుకు?

సింహాచలం దేవస్థానం భూమి 160 ఎకరాలు గూగుల్ డేటా సెంటర్ కు కేటాయించినప్పుడు అడ్డురాని దేవాదాయ చట్టం, పంచగ్రామాల ప్రజల ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు ఎందుకు అడొస్తుందని ప్రశ్నించారు. ఇచ్చిన హామీ ప్రకారం తక్షణమే పంచగ్రామాల ప్రజల ఇళ్ల స్థలాలను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. పేదరిక నిర్మూలనకు పెట్టిన పి 4ను పక్కనబెట్టి, అసంతృప్తితో వున్న టిడిపి కార్యకర్తలను సంతృప్తిపర్చేందుకు ఈ 3ని చంద్రబాబు ప్రవేశపెట్టారని అన్నారు. ప్రజలను గాలికొదిలేసి, కొద్దిమంది టిడిపి కార్యకర్తలు లబ్దిపొందేలా సంపాదించుకోండి, తినండి, పదవులు పొందడి అని ఈ 3ని పెట్టారని అన్నారు. కార్పొరేట్ సంస్థలు తమ భూములు అమ్ముకోవడానికి, బ్యాంకు రుణాలు తెచ్చుకొనేలా కాకుండా, 22ఎ నుంచి సాధారణ రైతుల భూములను తొలగించడానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు అమ్ముకోవచ్చని చెప్పడం వెనుక వాటిని కొల్లగొట్టుకోవడానికి వేస్తున్న ఎత్తులని అని అన్నారు. పేదలకు ఆస్తులపై శాశ్వత హక్కు కల్పించాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఆరు జోన్లలో ప్రత్యేకంగా సీతంపేట నుంచి ఎటపాక వరకు గిరిజన మండలాలతో కలిపి కలిపి ఒక జోన్ ఏర్పాటుచేసి గిరిజన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. కార్మిక సంక్షేమంపై ప్రత్యేక మంత్రివర్గ సమావేశం ఏర్పాటుచేసి వారి సంక్షేమం, వేతన పెంపుదలకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్ కెఎస్ వి కుమార్, జిల్లా కమిటీ సభ్యులు ఆర్ఎస్ఎన్ మూర్తి పాల్గొన్నారు.

Leave a Reply