పూలే ఆశయాలను ప్రతి ఒక్కరం ఆచరణలో పెట్టాలి..

పూలే ఆశయాలను ప్రతి ఒక్కరం ఆచరణలో పెట్టాలి..

బాల్యవివాహాల నిర్మూలనకు సమాజం ముందుకు రావాలి..
రాష్ట్ర మంత్రి… జిల్లా కలెక్టర్..

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : సామాజిక సమానత్వం, విద్యా విస్తరణ, మహిళా సాధికారత కోసం జీవితాంతం పోరాడిన మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌.ఎం‌.డి ఫరూక్ జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియాలు పిలుపునిచ్చారు. శనివారం మహాత్మ జ్యోతిరావు పూలే 200వ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

కార్యక్రమంలో మంత్రి ఎన్ ఎం డి ఫరూక్,జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, జిల్లా అధికారులు పాల్గొని పూలే విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూలే దేశంలో సామాజిక సంస్కరణలకు పునాది వేసిన మహానుభావుడని పేర్కొన్నారు. కుల, మత వివక్షలను ఎదుర్కొంటూ సమాన హక్కుల కోసం పోరాడిన ఆయన జీవితం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమన్నారు.

మాజీ ముఖ్యమంత్రి ఎన్‌.టి. రామారావు ప్రవేశపెట్టిన సంక్షేమ, సామాజిక సంస్కరణలను చేపట్టారన్నారు. ముఖ్యంగా మహిళల సాధికారతకు తీసుకున్న చర్యలు, వెనుకబడిన వర్గాలకు కల్పించిన అవకాశాలు రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయని అన్నారు. మైనారిటీల కోసం గురుకుల విద్యా సంస్థలు, ఆరోగ్య సదుపాయాల విస్తరణ వంటి కార్యక్రమాలు సామాజిక న్యాయానికి దారితీసినవని వివరించారు.

స్త్రీ విద్య ప్రాధాన్యతను ఆయన ఎంతో ముందుగానే గుర్తించి, తన భార్య సావిత్రిబాయి పూలే సహకారంతో ఆడపిల్లల కోసం పాఠశాలలను స్థాపించడం చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. “ఒక మహిళ చదువుకుంటే ఒక కుటుంబం మొత్తం అభివృద్ధి చెందుతుంది” అనే భావనను ప్రతి కుటుంబం ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. బాల్య వివాహాలు వంటి సామాజిక సమస్యలు ఇంకా కొంతవరకు కొనసాగుతున్నాయన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

విద్యా రంగ అభివృద్ధికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. విద్యార్థుల పోషణ కోసం ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’, అవసరమైన విద్యాసామగ్రి కోసం ‘విద్యార్థి మిత్ర’ పథకం అమలు అవుతున్నాయన్నారు. బాల్య వివాహాలు, కుల అసమానతలు, వితంతు వివాహాల నిషేధం వంటి అనేక సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం సమాజాన్ని మార్పు దిశగా నడిపిందన్నారు.

ఈ మార్పుకు మూలం విద్య, చైతన్యమేనని, భావితరాలకు ఈ విలువలను చేరవేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, బీసీ సంక్షేమ అధికారి జగ్గయ్య,వివిధ సంఘాల ప్రతినిధులు రమణయ్య గౌడ్, జిల్లెల్ల శ్రీనివాసులు, బాలస్వామి, నాగశేషుడు, సుధాకర్, రామచంద్రరావు, కొమ్ము పాలెం శ్రీనివాసులు, వేణుగోపాల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply