హోటల్ పరిశ్రమను ఆదుకోండి…

హోటల్ పరిశ్రమను ఆదుకోండి…

ముఖ్యమంత్రికి హోటల్ అసోసియేషన్ విన్నపం

విజయవాడ, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో హోటల్, ఆతిథ్య రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, పరిశ్రమను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కోరింది. బుధవారం ఏపీ స్టార్‌ హోటల్స్‌ అసోయేషన్‌ అధ్యక్షుడు ఆర్.వి.స్వామి నేతృత్వంలోని ప్రతినిధులు సీఎంని కలిసి తాజా పరిస్థితిని చర్చించింది.

రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి, ఉపాధి కల్పనకు ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును ఈ సందర్భంగా కొనియాడారు. హోటల్ యజమానులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గ్యాస్ సరఫరాను పెంచాలి: ప్రస్తుతం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు క్షేత్రస్థాయిలో కేవలం 10% నుండి 15% వరకు మాత్రమే గ్యాస్ సరఫరా చేస్తున్నాయని, దీనివల్ల హోటళ్ల నిర్వహణ అత్యంత భారంగా మారిందని ప్రతినిధులు వివరించారు. కేంద్ర పెట్రోలియం శాఖ మార్గదర్శకాల ప్రకారం ఈ సరఫరాను 50% వరకు పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

విద్యుత్ ఛార్జీల్లో రాయితీ: గ్యాస్ కొరత కారణంగా అనేక హోటళ్లు ఇండక్షన్ ఎలక్ట్రిక్ వంట విధానాలకు మళ్లుతున్నాయని తెలిపారు. అయితే కమర్షియల్ టారిఫ్ వల్ల విద్యుత్ బిల్లులు భారీగా పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రభుత్వం తరహాలోనే, ఎలక్ట్రిక్ కుకింగ్ విధానాన్ని అనుసరించే హోటళ్లకు యూనిట్‌కు రూ. 2 విద్యుత్ సబ్సిడీ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

పీఎన్‌జీ మౌలిక సదుపాయాలు: విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో పైప్డ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్ల విస్తరణను వేగవంతం చేయాలని కోరారు. దీనివల్ల ఎల్పీజీ సిలిండర్లపై ఆధారపడటం తగ్గి, తక్కువ ఖర్చుతో కూడిన ఇంధనం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ఆతిథ్య రంగం మనుగడ సాగించాలంటే ప్రభుత్వ మద్దతు అవసరమని ఆర్.వి.స్వామి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు ప్రతినిధులు పేర్కొన్నారు.

Leave a Reply