ఘనంగా ప్రపంచ జల దినోత్సవం…

ఘనంగా ప్రపంచ జల దినోత్సవం…

నీటి సంరక్షణపై అవగాహన పెంపు అవసరం

కర్నూలు, ఆంధ్రప్రభ : నీటి ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొన్నారు. ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక బీ క్యాంపులోని గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ మెన్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి ఆదేశాల మేరకు లీగల్ సర్వీస్ యూనిట్ సభ్యుడు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా కాలుష్య నియంత్రణ మండలి, లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూలు మెల్విన్ జోన్స్ సంయుక్తంగా ఈ వేడుకలను నిర్వహించాయి.

ఈ సందర్భంగా రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ త్రినాథ్ కుమార్ మాట్లాడుతూ నీటి ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ప్రతి సంవత్సరం మార్చి 22న ప్రపంచ జల దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నీటి కొరత, పారిశుద్ధ్య సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టడం ఈ దినోత్సవ ప్రధాన ఉద్దేశమన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనాలిస్ట్ ఇమ్రాన్ మాట్లాడుతూ నీటి నిర్వహణలో మహిళలు, బాలికల పాత్ర కీలకమని పేర్కొన్నారు.

భూగర్భ జలాలను పెంపొందించడం, నీటి కాలుష్యాన్ని తగ్గించడం, వర్షపు నీటి నిల్వలను పెంచడం, నీటి పొదుపు అలవాట్లు అలవరచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా “నీటి కాలుష్య నివారణలో యువత పాత్ర, వినియోగదారుల హక్కులు” అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, షీల్డ్‌లను త్రినాథ్ కుమార్ అందజేశారు. కార్యక్రమంలో కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిరా ప్రశాంతి, వైస్ ప్రిన్సిపల్స్ హేమంత్, సత్యనారాయణ, బిపిఓ పవన్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ ఫక్రున్నీసా బేగం, వోకేషనల్ కాలేజ్ ప్రిన్సిపల్ నాగస్వామి నాయక్, విభాగాధిపతి నాగన్న, లెక్చరర్ నాగరత్నమ్మ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Leave a Reply