కన్న కొడుకే… కాటికి పంపాడు..

కన్న కొడుకే…కాటికి పంపాడు..

  • మద్యం మత్తులో డబ్బుల కోసం తల్లిదండ్రులపై దాడి..
  • తల్లి మృతి..తండ్రికి తీవ్ర గాయాలు..
  • మూడు రోజులు మృత్యువుతో పోరాడుతూ తల్లి మృతి..

అవుకు రూరల్, ఆంధ్రప్రభ : కుమారుడు కాదు.. తల్లిదండ్రుల పాలిట కాలయముడయ్యాడు. కన్నతల్లినే పొట్టన పెట్టుకున్నా కొడుకు కథ ఇది. సమాజంలో మానవ విలువలు పతనమవుతున్న తీరును కరుణ, దయ కరువైపోతున్న దారుణ పరిస్థితిలను వినాల్సి వస్తుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. వివరాల్లోకెళ్తే… అవుకు పట్టణానికి చెందిన పుసులూరు శేఖర్ లక్ష్మీదేవి (45) లకు కూతురు అంజనమ్మ, కుమారుడు ఆంజనేయులు (25) సంతానం. కూతురుకి 8 సంవత్సరాల క్రితం వివాహం చేశారు. తల్లిదండ్రులు వ్యవసాయం కూలీ చేస్తూ జీవనం సాగించేవారు. తల్లిదండ్రులకు వ్యవసాయంలో చేదోడు వాదోడుగా ఉండే ఆంజనేయులు చెడు అలవాట్లకు బానిసయ్యాడు. కన్న తల్లిదండ్రలు అని చూడకుండా ఈనెల 19న ఉగాది పండుగ రోజు ఆంజనేయులు మద్యం సేవించి 50 వేలు ఇతరుల దగ్గర అప్పు చేశానని డబ్బులివ్వాలని తల్లిదండ్రుల పై గొడవకు దిగినట్లు బంధువులు తెలిపారు.

తల్లిదండ్రులిద్దరు డబ్బుల్లేవని చెప్పడంతో మద్యం మత్తులో ఉన్న ఆంజనేయులు ఒక్కసారిగా కోపోద్రేక్తుడై తల్లిదండ్రులపై ఆగ్రహంతో ఇంట్లోనే ఉన్న బలమైన కట్టెతో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో తల్లిదండ్రులిద్దరు గాయపడ్డారు. తల్లి లక్ష్మీదేవికి తలకు, తండ్రి శేఖర్ ఒంటిపై తీవ్రమైన గాయాలు అవ్వడంతో గమనించిన స్థానికులు, బంధువులు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడుతూ తల్లి లక్ష్మీదేవి ఆదివారం మృతి చెందగా, తండ్రి శేఖర్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు బంధువులు తెలిపారు. కన్న తల్లిదండ్రుల పై దాడికి పాల్పడిన నిందితుడు పరారిలో ఉన్నట్లు తెలుస్తోంది. దాడికి పాల్పడిన వ్యక్తి నాలుగు సంవత్సరాల క్రితం రామాపురం గ్రామంలో ఓ ఇంటిలో స్నేహితులతో కలిసి పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడ్డాడు. అప్పటి ఎస్సై జగదీశ్వర్ రెడ్డి కేసును చాకచక్యంగా చేధించి 24 గంటల్లోనే నిందితులను అరెస్టు చేసి పూర్తిస్థాయిలో సొమ్మును రికవరీ చేశారు.

Leave a Reply