jeevan reddy | కారెక్కేనా.. క‌మ‌లం అందుకునేనా?

jeevan reddy | కారెక్కేనా.. క‌మ‌లం అందుకునేనా?

పార్టీ మార‌నున్న హ‌స్తం పార్టీ సీనియ‌ర్ నేత జీవ‌న్‌రెడ్డి
బీఆర్ఎస్‌, బీజేపీల నుంచి భారీ ఆఫ‌ర్లు
ఏం పార్టీలో చేరాల‌నే దానిపై సందిగ్ధం
అనుచ‌రుల‌తో వ‌రుస స‌మావేశాలు
జీవ‌న్‌రెడ్డిని బుజ్జ‌గిస్తున్న కాంగ్రెస్ నేత‌లు
స‌సేమిరా అంటున్న జీవ‌న్‌రెడ్డి..
నా నిర్ణ‌యంలో మార్పు లేదంటున్న జీవ‌న్‌రెడ్డి

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీ వీడాల‌నే నిర్ణ‌యించుకున్నారు. అటు కాంగ్రెస్ నాయకత్వం బుజ్జగింపులు కొనసాగించినా జీవ‌న్‌రెడ్డి స‌సేమిరా అంటున్నారు. తాను కాంగ్రెస్ లో కొనసాగలేనని స్పష్టం చేస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ నేత లు జీవన్ రెడ్డితో టచ్ లోకి వ‌చ్చారు. జీవన్ రెడ్డికి ఆ రెండు పార్టీలు ఆఫర్ల మీద ఆఫ‌ర్లు ఇస్తున్నాయి. ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ తో సైతం జీవన్ రెడ్డి ఫోన్ లో మాట్లాడినట్లు సమాచారం. జీవన్ రెడ్డి అనుభవానికి అనుగుణంగా తగిన ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్దమైన వేళ బీజేపీ నేతల నుంచి భారీ ఆఫర్ రావటం తో సందిగ్ధంలో పడ్డారు. మాజీ మంత్రి నేరుగా జీవన్ రెడ్డిని బీజేపీలోకి రావాలని ఆహ్వానించారు. జీవ‌న్ రెడ్డి త‌న మద్దతు దారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏ పార్టీలో చేరేది త్వ‌ర‌లో ఆయ‌న ప్ర‌క‌టించ‌నున్నారు.

పార్టీ ఎందుకు మారాల‌నుకుంటున్నారు..?
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ టీ. జీవన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడటానికి ప్రధాన కారణం జగిత్యాల ఎమ్మెల్యే ఎం. సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరడం, స్థానిక రాజకీయాల్లో ఆయన జోక్యం చేసుకోవడం అని తెలుస్తోంది. 40 ఏళ్ల కాంగ్రెస్ అనుబంధం ఉన్నా, పార్టీలో తన ప్రాధాన్యత తగ్గిందని, సంజయ్ కుమార్ వంటి నాయకులకు పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వ్యవహారశైలి, జగిత్యాల నియోజకవర్గ కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాల్లో ఆయన జోక్యాన్ని జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సంజయ్ కుమార్ పార్టీలో చేరినప్పటి నుండి తనకు పార్టీలో తగిన గౌరవం, ప్రాధాన్యత దక్కడం లేదని ఆయన మనోవేదనకు గురయ్యారు. పార్టీ అధికారంలో ఉన్నా, స్థానిక సమస్యలను అధిష్టానం పట్టించుకోవడం లేదని, తనను ఓడించిన వ్యక్తికి పార్టీ ప్రాధాన్యత ఇవ్వడంపై ఆగ్రహంతో ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో, ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, ఇతర పార్టీలలో చేరే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే, ఈయనను బుజ్జగించేందుకు మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రయత్నిస్తున్నా జీవ‌న్ రెడ్డి త‌గ్గేదేలే అంటున్నారు. త‌న నిర్ణ‌యంలో మార్పు లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ నెల 25న జీవన్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసి.. జగిత్యాలలో భారీ సభ ఏర్పాటు చేసి గులాబీ కండువా కప్పుకోనున్నట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

Leave a Reply