సత్తియాడి జాతరకు భారీ ఏర్పాట్లు..

సత్తియాడి జాతరకు భారీ ఏర్పాట్లు..

భక్తుల రాకకు తండాల సిద్ధం
సదుపాయాల కల్పనకు ప్రభుత్వ దృష్టి అవసరం, నాయకుల విజ్ఞప్తి

నల్లబెల్లి , ఆంధ్రప్రభ : వరంగల్ ఉమ్మడి జిల్లా నల్లబెల్లి మండలం మేడపల్లి గ్రామ పరిధిలోని పవిత్ర చెరువు శిఖరంపై వెలసి ఉన్న బంజారా జాతి ఆరాధ్య దైవం శ్రీ సత్తియాడి (లక్ష్మి దేవత) వారి వార్షిక జాతర మహోత్సవం ఈ నెల 23వ తేదీ సోమవారం ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. బంజారా (లంబాడి) సమాజానికి రక్షక దేవతగా, ఆర్థికాభివృద్ధి, కుటుంబ శ్రేయస్సుకు దీవెనలిచ్చే తల్లిగా విశ్వాసం కలిగిన సత్తియాడి దేవత జాతరకు ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఈ సంవత్సరం కూడా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న అనేక తండాల నుంచి లంబాడీ సోదర సోదరీమణులు భారీ సంఖ్యలో పాల్గొనే అవకాశo ఉన్నదని నిర్వాహకులు తెలిపారు.

ఈ మహోత్సవాన్ని 16 తండాల గౌరవనీయ నాయకులు, గ్రామ పెద్దలు సమిష్టిగా నిర్వహించడం ప్రత్యేకత. జాతర సందర్భంగా శాస్త్రోక్త పూజలు, బంజారా సంప్రదాయ ఆచారాలు, ప్రత్యేక వేడుకలు నిర్వహించడంతో పాటు భక్తులు కీర్/లాప్సీ (బెల్లం అన్నం) నైవేద్యంగా సమర్పించి, అనంతరం ప్రసాదంగా పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా తండాల నాయకులు, గ్రామ పెద్దలు మాట్లాడుతూ. సత్తియాడి దేవతపై లంబాడీ సమాజానికి ఉన్న నమ్మకం అపారమని, తల్లి ఆశీస్సులతో అనేక కుటుంబాలు అభివృద్ధి చెందాయని తెలిపారు. ఈ జాతర మరింత వైభవంగా జరిగేలా ప్రతి ఒక్కరూ పాల్గొని ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు.అదేవిధంగా, జాతరకు భారీగా భక్తులు తరలివచ్చే నేపథ్యంలో మేడపల్లి గ్రామానికి వెళ్లే రహదారులు మరమ్మతులు చేయాలని, గుడి పరిసరాల్లో విద్యుత్ సదుపాయం మెరుగు పరచాలని, తాగునీటి వసతి కల్పించాలని అధికారులను కోరారు.

భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా తాత్కాలిక పందిళ్లు (భవనాలు), విశ్రాంతి కేంద్రాలు, స్నానాల గదుల సదుపాయాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు సంబంధిత శాఖల అధికారులు స్పందించి ఈ పవిత్ర స్థలాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఈ గుడి అభివృద్ధి చెందితే భవిష్యత్తులో ఇది ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా నిలిచే అవకాశముందని అభిప్రాయపడ్డారు. ఇకపోతే, లంబాడీ సమాజంలో ఆర్థికంగా స్థిరపడిన దాతలు, వ్యాపారవేత్తలు,ఉద్యోగస్తులు ముందుకు వచ్చి గుడి అభివృద్ధికి సహకరించాలని తండాల నాయకులు పిలుపునిచ్చారు. భక్తులకు అవసరమైన సదుపాయాల కల్పన, శాశ్వత నిర్మాణాలు చేపట్టేందుకు ఆర్థిక సహాయం అందించాలని కోరారు. జాతర సందర్భంగా మేడపల్లి గ్రామం పండుగ వాతావరణంలో మునిగిపోనుండగా, చుట్టు పక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తూ జాతరను విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారు.

Leave a Reply