ప్రతి అర్జీపైనా ప్రత్యేకంగా దృష్టిసారించాలి..

ప్రతి అర్జీపైనా ప్రత్యేకంగా దృష్టిసారించాలి..
గడువులోపు సమస్యకు పరిష్కారం చూపాలి..
ఎన్టీఆర్ జిల్లాస్థాయి పీజీఆర్ఎస్కు 174 అర్జీలు…
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, ఆంధ్రప్రభ : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చే ప్రతి అర్జీపైనా ప్రత్యేకంగా దృష్టిసారించాలని.. అర్జీదారులు సంతృప్తి చెందేలా నిర్దిష్ట గడువులోగా సమస్యకు పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ లక్ష్మీశ.. డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, పీజీఆర్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ జి.జ్యోతి, ఏసీపీ వెంకటేశ్వరరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పోసిబాబుతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 174 అర్జీలు వచ్చాయి.
వీటిలో రెవెన్యూకు సంబంధించి 66 అర్జీలు రాగా పురపాలక, పట్టణాభివృద్ధికి సంబంధించి 26, పోలీస్ 18, పంచాయతీరాజ్ 15, మార్కెటింగ్ 5, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ విభాగానికి అయిదు అర్జీలు వచ్చాయి. విద్యుత్, పౌర సరఫరాలు, విభిన్న ప్రతిభావంతులు, ఆరోగ్య శాఖలకు నాలుగు చొప్పున అర్జీలు అందాయి. ఇరిగేషన్కు 3 అర్జీలు రాగా ఏపీఎస్ఆర్టీసీ, ఎక్సైజ్, విద్య, గృహ నిర్మాణం, మైన్స్, నైపుణ్య అభివృద్ధి, ఎండోమెంట్ కి రెండు చొప్పున అర్జీలు వచ్చాయి. పశు సంవర్థక, ఆయుష్, బ్యాంకింగ్ సేవలు, డీఆర్డీఏ, ఐసీడీఎస్, కార్మిక శాఖకు ఒక్కో అర్జీ వచ్చాయి.
ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ… ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించి పీజీఆర్ఎస్ ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న విశ్వసనీయ వేదిక అని, ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. అర్జీల పరిష్కారంలో జాప్యం చేయకుండా క్షేత్ర స్థాయిలో పరిశీలనలు చేసి ప్రజలకు న్యాయం చేయాలని అధికారులకు ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో పారదర్శకత, బాధ్యతాయుత విధానం పాటించాలని కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం చేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
