పోర్టిఫైడ్ బియ్యం సరఫరా నిలిపివేతపై మిల్లర్స్ హర్షం

పోర్టిఫైడ్ బియ్యం సరఫరా నిలిపివేతపై మిల్లర్స్ హర్షం

కేదారాజేశ్వర పేట, ఆంధ్రప్రభ: ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన క్రింద పిడిఎస్ సహా వివిధ సంక్షేమ పథకాలకు, పంపిణీ చేసే ఫోర్టిఫైడ్ కెర్నల్స్ కలిపిన బలవర్ధకమైన సిఎంఆర్ బియ్యం సరఫరాను కేంద్రం తాత్కాలికంగా నిలిపి వేసిందని ఏపీ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం విజయవాడ గాంధీనగర్ లోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హల్ లో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గుమ్మడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎస్ఆర్కి గింజల కొరత వల్ల దేశవ్యాప్తంగా సిఎంఆర్ సేకరణలకు ప్రతిష్ఠంభన జరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం పట్ల రైస్ మిల్లర్ల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయన్నారు.

ఎస్ఆర్కి గింజల ఉత్పత్తి, సరఫరా అవసరమైన పరిమాణంలో జరగక పోవటంతో బియ్యం సేకరణలకు దేశవ్యాప్తంగా ఆటంకం కలుగుతోందని, ఎఫ్ ఆర్కే కెర్నల్స్ నాణ్యతా పరీక్షలు వివిధ దశలలో జరిగే సమయంలో సరఫరా ఆలస్యం కావటం, ఉత్పత్తి కూడా అవసరమైన మేరకు జరగకపోవటంతో రైస్ మిల్లర్లకు బ్లెండింగ్ కై ఎఫ్ ఆర్కే సరఫరా సకాలంలో జరగటం లేదన్నారు. రైతుల నుండి సేకరించిన ధాన్యం ఎఫ్ఆర్కే కొరత వల్ల సకాలంలో మిల్లింగ్ జరగక ధాన్యం పాడైపోయే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఇది రైస్ మిల్లర్లకు నష్టదాయకమేకాక, పిడిఎస్ అవసరాలకు బియ్యం లభ్యతకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు.


ఈ సమస్యను గురించి ఎపి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఎపి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తీసుకెళ్ళగా, ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు. రాష్ట్ర రైతుల శ్రేయస్సును, పిడిఎస్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎఫ్ ఆర్కే సమస్యను పరిష్కరించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసిందన్నారు.

ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్, కమీషనరు సౌరభ్ గౌర్, ఎండి ఢిల్లీరావు ఈ సమస్యపై దృష్టి పెట్టి పరిష్కారానికి కృషి చేశారని చెప్పారు. ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా రైస్ మిల్లర్స్ అసోసియేషన్(ఫెయిర్మా), ఎపి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సమర్థవంతంగా ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళారని తెలియచేశారు.


ఈ నేపధ్యంలో ఆల్ ఇండియా రైస్ మిల్లర్స్ ఫెడరేషన్ (ఫెయిర్మా) చైర్మన్, ఎపి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు ఫెయిర్మా అధ్యక్షులు తర్సేమ్ సైనీ నేతృత్వంలో గత
నెలలో కేంద్ర ఆహార మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి సమస్య తీవ్రతను వివరించి, నాన్ ఎఫ్ ఆర్కే బియ్యాన్ని డెలివరీలు ఎఫిసిఐ తీసుకొనేట్లు చూడాలని అభ్యర్థించారు.

ఛాతీసగఢ్ కు చెందిన రాజ్యసభ సభ్యులు బ్రిజ్ మోహన్ అగర్వాల్ ఈ సమస్యపై చొరవ చూపి కేంద్ర మంత్రిని ఒప్పించుటలో సహకరించారని, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, కమీషనర్ సౌరబ్ గౌర్, ఎండి ఢిల్లీరావులు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఈ సమస్య తీవ్రతను గూర్చి కేంద్రానికి లేఖ ద్వారా తెలియచేసారని చెప్పారు. ఈ అంశంపై సానుకూలంగా స్పందించిన కేంద్ర ఆహార శాఖ, అన్ని సంక్షేమ పధకాలకు ఎఫ్ ఆర్కే బియ్యం పంపిణీను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు ఫిబ్రవరి 27వ తేదీన ఉత్తర్వు ద్వారా అన్ని రాష్ట్రాల పౌరసరఫరాల శాఖ అధికారులకు, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియ చేసిందని అన్నారు.

Leave a Reply