రాయలసీమ ప్రాజెక్టులకు అన్యాయం

రాయలసీమ ప్రాజెక్టులకు అన్యాయం

కల్తీ నెయ్యి వ్యవహారంపై చర్చకు భయపడుతోన్న ప్రభుత్వం
హెరిటేజ్–ఇందాపూర్ వ్యవహారంపై పారదర్శక చర్చ చెయ్యాలి
సభా నియమాలు ఉల్లంఘించి చర్చను వాయిదా దారుణం
శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయ

ఆంధ్రప్రభ ,ఎన్టీఆర్ బ్యూరోః రాయలసీమ నీటిపారుదల ప్రాజెక్టులు, కల్తీ నెయ్యి వ్యవహారంపై విపక్షం చర్చకు ముందుకు వస్తే చర్చించే ధైర్యం కోటమి ప్రభుత్వం చేయడం లేదని శాసనమండలి విపక్ష నేత వత్స సత్యనారాయణ విమర్శించారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా వెలగపూడి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మండలి పార్టీ ఎమ్మెల్సీలతో కలిసి మాట్లాడుతూ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారాలపై చర్చకు అంగీకరించిన ప్రభుత్వం సభలో మాత్రం సమాధానం చెప్పలేక ఉద్దేశపూర్వకంగా వాయిదా వేసిందని ఆరోపించారు.

రాయలసీమకు జీవనాధారమైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై స్పష్టత ఇవ్వకుండా ప్రభుత్వం పిట్టకథలతో కాలక్షేపం చేస్తోందని విమర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం స్పందించలేకపోవడం దాని వైఖరిని బహిర్గతం చేస్తోందన్నారు. ప్రాజెక్టు ప్రారంభం, పూర్తి గడువు, నిలిచిపోయిన కారణాలపై ప్రత్యక్ష సమాధానం ఇవ్వలేక చర్చను దారి మళ్లించారని ఆక్షేపించారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో నిజాలు బయటపడతాయనే భయంతోనే చర్చను అడ్డుకుంటున్నారని బొత్స సత్యనారాయణ అన్నారు. ఇందాపూర్ డెయిరీ, హెరిటేజ్ సంస్థల మధ్య సంబంధాలు, టీటీడీకి అధిక ధరలకు నెయ్యి సరఫరా వంటి అంశాలపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు.

బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు విక్రయించే నెయ్యిని టీటీడీకి అధిక ధరలకు సరఫరా చేయడం అవినీతి కాదా అని ప్రశ్నించారు. అదేవిధంగా, తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లు తిరిగి ఇతర పేర్లతో ఎలా టీటీడీలోకి ప్రవేశించాయో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలపై మండలిలో చర్చకు అవకాశం ఇవ్వకుండా సభను హైజాక్ చేసే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. చైర్మన్‌కు తెలియకుండా విధానాలు మార్చి చర్చను నిలిపివేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. సభా మర్యాదలు, వ్యక్తుల గౌరవాన్ని కించపరుస్తూ మీడియా ప్రచారం కోసం వ్యవహరించడం సరైన పద్ధతి కాదని సూచించారు. అధికార పార్టీ సభ్యులు పోడియం వద్దకు వెళ్లి సభను అడ్డుకోవడం అనుచితమని పేర్కొన్నారు.

తిరుమల శ్రీవారి ప్రసాదంపై చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యమని, విచారణల్లో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. దేవాలయాలను రాజకీయాల్లోకి లాగి ప్రజల విశ్వాసాలను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. ఆలయాల నిర్వహణలో జరిగిన దుర్ఘటనలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో జరిగిన పలు ఆలయ ఘటనలను ప్రస్తావిస్తూ భక్తుల భద్రతపై ప్రభుత్వం విఫలమైందని ఆక్షేపించారు.

దుర్ఘటనలపై బాధ్యత నిర్ధారణ చేయకుండా డైవర్షన్ రాజకీయాలు కొనసాగుతున్నాయని తెలిపారు. చర్చకు భయపడకుండా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని, కల్తీ నెయ్యి, రాయలసీమ ప్రాజెక్టులపై పూర్తి వివరాలు వెల్లడించాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. సమావేశాల చివరి వరకు ఈ అంశాలపై వైయస్సార్సీపీ పట్టుబడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.

Leave a Reply