సింగినగర్ రెండో ఫ్లైఓవర్ ఇవ్వండి

సింగినగర్ రెండో ఫ్లైఓవర్ ఇవ్వండి
సెంట్రల్లో ట్రాఫిక్కు శాశ్వత పరిష్కారం
అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో సెంట్రల్ సమస్యలపై ఎమ్మెల్యే బోండా ఉమా ప్రస్తావన..
సింగనగర్కు కొత్త ఆర్ఓబీ అవసరమని విజ్ఞప్తి..
పాయకాపురం, ఆంధ్రప్రభ : రోజురోజుకి అత్యంత రద్దీగా మారుతున్న సెంట్రల్ నియోజకవర్గంలోని సింగినగర్కు రెండో ఫ్లోర్ మంజూరు చేయాలని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ పాండా ఉమామహేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో నియోజకవర్గంలో నెలకొన్న ప్రధాన సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా పెరుగుతున్న ట్రాఫిక్ భారాన్ని తగ్గించేందుకు రెండో ఫ్లైఓవర్ నిర్మాణం అత్యవసరమని ప్రభుత్వాన్ని కోరారు. సభలో మాట్లాడిన ఆయన, సెంట్రల్ నియోజకవర్గంలో ప్రస్తుతం మూడు కీలక సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు.
వాటిలో ట్రాఫిక్ సమస్య అత్యంత తీవ్రమైందని, దీని పరిష్కారం కోసం తక్షణ చర్యలు అవసరమని స్పష్టం చేశారు. 1996-97 కాలంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలో నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ (ఆర్ఓబీ) అప్పటి అవసరాలకు సరిపోయినా, ప్రస్తుత పరిస్థితుల్లో అది తగినంత కాకపోతుందని వివరించారు. ఆ సమయంలో సుమారు 50 వేల జనాభా మాత్రమే ఉన్న ప్రాంతంలో, ప్రస్తుతం రెండు లక్షలకు పైగా జనాభా నివసిస్తున్నారని తెలిపారు. అదే మార్గం నున్న–గన్నవరం వైపు వెళ్లే ప్రధాన రహదారిగా మారడంతో ట్రాఫిక్ తీవ్రంగా పెరిగిందని పేర్కొన్నారు. దీనివల్ల రోజువారీ ప్రయాణికులు భారీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సభకు వివరించారు.
ఈ నేపథ్యంలో సింగనగర్ ప్రాంతానికి రెండో ఫ్లైఓవర్ నిర్మాణం అత్యవసరమని బోండా ఉమా సూచించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రైల్వే శాఖకు ప్రతిపాదనలు పంపినట్లు, రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం వ్యయం భరిస్తే నిర్మాణానికి తాము సిద్ధమని రైల్వే అధికారులు ఇప్పటికే స్పష్టంచేసినట్లు తెలిపారు. అందువల్ల ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని సింగనగర్కు రెండో ఫ్లైఓవర్ మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై ప్రభుత్వం స్పందించి త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని సభలో కోరారు.
